Share News

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:55 PM

మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం రెండు ఇళ్లలో చొరబడి బంగారం, వెండి అభరణాలు దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు తరలించారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

రెండిళ్లలో చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్‌

బంగారం, వెండి స్వాధీనం

కొత్తూర్‌, సెప్టెంబర్‌ 21: మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం రెండు ఇళ్లలో చొరబడి బంగారం, వెండి అభరణాలు దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు కథనం మేరకు.. ఈనెల 18న మండల కేంద్రంలోని మల్లికార్జునకాలనీలో ఉంటున్న బాలునరేంద్ర ఇంటికి తాళం వేసి వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు తాళం బద్దలు గొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న దాదాపు 5తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. భవానినగర్‌ కాలనీలో ఉంటున్న రింకూదేవి ఇంటికి తాళం వేసి వెళ్లగా, తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి 13తులాల వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై మురళీగౌడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో గాలింపులు జరుపుతుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ సబీర్‌, ఏపీకి చెందిన షేక్‌నూర్‌మహమ్మద్‌లు గతంలో పలు నేరాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చి, తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారి నుంచి బంగారం, వెండి అభరణాలు, 2సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు వారికి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఏఎ్‌సఐ శ్రీనివాసాచారి, కానిస్టేబుళ్లు ఎర్ర కుమార్‌, రవికుమార్‌ కేసు చేధించినవారిలో ఉన్నారు. దొంగతనం కేసును రెండు రోజుల్లో చేధించిన కొత్తూర్‌ పోలీసులను పలువురు ఈ సందర్భంగా అభినందించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:55 PM