Share News

త్వరలో స్థానిక సమరం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:09 AM

గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 2వ తేదీతో ముగియగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటివారంలో ముగియనుంది. మునిసిపల్‌ పాలకవర్గాల పదవీకాలం 2025, జనవరి 26వ తేదీతో ముగియనుండగా, పీఏసీఎస్‌ పాలకవర్గాల పదవీకాలం అదే ఏడాది ఫిబ్రవరి నెలతో ముగియనుంది.

త్వరలో స్థానిక సమరం

‘లోక్‌సభ’ తరువాత ఎన్నికలు

జూలైలోగా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేసే దిశగా కసరత్తు?

లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు నాయకులకు అవకాశం

లోక్‌సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సమరం ప్రారంభం కాబోతోంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్‌ 4వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తరువాత పురపాలక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేస్తారో.. వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఆశావహులు దూసుకుపోతున్నారు.

వికారాబాద్‌/మేడ్చల్‌/రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 2వ తేదీతో ముగియగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటివారంలో ముగియనుంది. మునిసిపల్‌ పాలకవర్గాల పదవీకాలం 2025, జనవరి 26వ తేదీతో ముగియనుండగా, పీఏసీఎస్‌ పాలకవర్గాల పదవీకాలం అదే ఏడాది ఫిబ్రవరి నెలతో ముగియనుంది. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామాల్లో పాలకవర్గాల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీల ఎన్నికలు వాయిదా వేశారు. జూలై మొదటివారంలో జిల్లా, మండల పరిషత్తుల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ తరువాత మునిసిపల్‌, పీఏసీఎస్‌ ఎన్నికలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి సారించనుంది. వచ్చే ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తి చేసి, అభివృద్ధిపై దృష్టి సారించాలని భావిస్తోంది. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో 18 మండల పరిషత్‌లు ఉండగా కొత్తగా చౌడాపూర్‌, దుద్యాల రెవెన్యూ మండలాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటిలో మండల ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) స్థానాలను గుర్తించాల్సి ఉంటుంది. 566 గ్రామ పంచాయతీలు, 20 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, గ్రామీణ ఓటర్ల జాబితా రూపొందించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

రంగారెడ్డి జిల్లాలో 27మండలాలు, 558 గ్రామపంచాయతీలున్నాయి. 2019లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 505పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 53 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదటివిడతలో మొత్తం 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 159 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 181 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 160 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 21పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే మూడో విడతలో 198 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 186 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 100 వార్డులు ఉండగా మున్సిపాలిటీల పరిధిలో 251 వార్డులు ఉన్నాయి. 2019లో రంగారెడ్డి జడ్పీని మూడుగా విభజించారు. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లా ప్రజాపరిషత్‌లను వేరు చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 21 మండల పరిషత్‌లు, 257 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు.

పనితీరు ఆధారంగానే అవకాశం

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కనీసం 14 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేస్తారో.. వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకులు, కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో చూపే పనితీరు ఆధారంగానే ఇందిరమ్మ కమిటీల్లోనూ సభ్యులుగా అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. బూత్‌లవారీగా సాధించిన మెజార్టీని పరిశీలించి నాయకుల పనితీరును అంచనా వేయనున్నారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో మునిసిపల్‌, పీఏసీఎస్‌ ఎన్నికలు?

మునిసిపల్‌, పీఏసీఎస్‌ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే అవకాశం ఉంది. మునిసిపల్‌ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీతో ముగియనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం అదే ఏడాది ఫిబ్రవరి నెలలో ముగుస్తుంది. ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేసుకుని, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా మునిసిపల్‌, పీఏసీఎస్‌ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.

పుంజుకున్న కాంగ్రెస్‌

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, ఐదు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకూ అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పలువురు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లాలో కేవలం ఒక సర్పంచ్‌, ఒక జడ్పీటీసీ స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు పార్టీలో చేరుతున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:48 AM