Share News

కొత్త ఏడాదిలోనే..

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:46 PM

పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. అధికారులు ఆగమేఘాలపై పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొత్త ఏడాదిలోనే ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయి.

కొత్త ఏడాదిలోనే..

స్థానిక సంస్థల ఎన్నికలు

కులగణన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం?

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

బ్యాలెట్‌ ముద్రణకు త్వరలో టెండర్లు

మేడ్చల్‌ జిల్లా పరిషత్‌పై సందేహాలు?

మొత్తం 15,31,990 మంది ఓటర్లు

నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక పాలన

పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. అధికారులు ఆగమేఘాలపై పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొత్త ఏడాదిలోనే ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయి. కులగణన డిసెంబర్‌ తర్వాతనే పూర్తయ్యే అవకాశాలు ఉండడంతో అప్పటి వరకు స్థానిక ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : గత జనవరి చివరి నాటికే పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా వేసి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకువచ్చారు. కానీ, అప్పటి నుంచి స్థానిక ఎన్నికల నిర్వహణ ఏదో కారణంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. కాగా, ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పాత బ్యాలెట్‌ బాక్సులకు మరమ్మతులు చేసి అవసరమైన చోట కొత్తవాటిని సిద్ధం చేస్తున్నారు. బ్యాలెట్‌ ముద్రణకు ఈ వారం పది రోజుల్లో టెండర్లు కూడా పిలవనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అనుగుణంగా బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. అయితే కులగణన పూర్తయిన తర్వాతే అంటే.. కొత్త ఏడాది జనవరి తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహించాలని సర్కార్‌ భావిస్తోంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఆలస్యమైతే దీనికి అనుగుణంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా ఆలస్యమవుతాయి.

తగ్గిన పంచాయతీల సంఖ్య

ఇదిలా ఉంటే ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఔటర్‌ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలను తొలుత సమీపంలోని పురపాలికల్లో కలిపి తరువాత వాటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఔటర్‌ రింగురోడ్డుకు ఇరువైపులా ఆనుకుని ఉన్న మొత్తం నగర శివార్లలోని 51 గ్రామాలను విలీనం చేయగా ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 39 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మేడ్చల్‌ జిల్లా పరిధిలో 28 గ్రామాలు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 21 గ్రామాలను విలీనం చేశారు. శివారుల్లోని గ్రామాలను సమీపంలోని పురపాలికల్లో విలీనం చేయడంతో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో పంచాయతీల సంఖ్య తగ్గింది.

మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ ఉంటుందా?

ఔటర్‌కు ఆనుకుని ఉన్న శివార్లలోని గ్రామాలను సమీప పురపాలికల్లో విలీనం చేయడంతో మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ ఉనికి ప్రశ్నార్థకమైంది. పురపాలికల్లో విలీనం అనంతరం మేడ్చల్‌లో కేవలం 3 మండలాల్లో 34 గ్రామ పంచాయతీలే మిగిలాయి. కేవలం 64వేల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. దీంతో జిల్లా పరిషత్‌ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఇపుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగితే కేవలం ముగ్గురు జెడ్పీటీసీలతో జిల్లా పరిషత్‌ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ పదవికి ముగ్గురూ పోటీ పడితే పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. అనాధికారిక సమాచారం మేరకు నియోజకవర్గాల పునర్విభజన వరకు జిల్లాల్లో మార్పులు చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లా పరిషత్‌ ఎన్నికలు ముగిసిన తరువాత ప్రత్యేక పాలన తీసుకువస్తారనే ప్రచారం సాగుతోంది.

మూడు విడతలుగా ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇంతకు ముందు ప్రకటించింది. అధికారులు సైతం ఇందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎన్నికల సిబ్బందితో కూడా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అంతకు మించి ఉంటే మరో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 200 మంది వరకు ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారి ఉంటారు. అలాగే 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 ఉన్న చోట ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారుల చొపుపన నియమిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:09 AM