Share News

నాయకులు విలువలకు కట్టుబడి పనిచేయాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:11 AM

నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో గుర్తింపు వస్తుందని, రాజకీయంగా అవకాశం వచ్చినవారు విలువలకు కట్టుబడి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

నాయకులు విలువలకు కట్టుబడి పనిచేయాలి
మాట్లాడుతున్న గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి

త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి

ఇబ్రహీంపట్నంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1 : నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో గుర్తింపు వస్తుందని, రాజకీయంగా అవకాశం వచ్చినవారు విలువలకు కట్టుబడి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్‌లో గవర్నర్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సహా పలు హిందూ, యువజన సంఘాల నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ 1979-80లో తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేసినప్పుడు కొన్నిచోట్ల తనను ప్రచారానికి రాకుండా కొందరు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. అప్పటికీ, ఇప్పటికీ రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఎవరు ఎక్కడనుంచైనా పోటీచేసే అవకాశం ఉందన్నారు. తనకు గవర్నర్‌గా అవకాశం వస్తుందని ఊహించింది కాదన్నారు. సిద్ధాంతం, విలువలకు కట్టుబడి పనిచేసిన వారికి ఏదో ఓ రూపంలో అవకాశం వస్తుందనేది గుర్తెరగాలన్నారు. రాష్ట్రపతులుగా అత్యున్నత పదవులు పొందిన రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌవది ముర్ములను ఇందుకు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతులు, నిరుద్యోగ యువత, వ్యవసాయ కార్మికులు ఇలా ఎవరి హక్కులు వారికుంటాయని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యతరాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ప్రజల అవసరాలను గుర్తించి గవర్నర్లు తగిన నిర్ణ్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనిని రాజకీయ కోణంలో చూడవద్దని అన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపుతూనే డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాల్సి ఉందని గవర్నర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బోసుపల్లి ప్రతాప్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, ఎంపీపీ సుకన్య, బీజేపీతో పాటు పలు సంఘాల నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, కళ్లెం బాల్‌రెడ్డి, రావినూతల శశిధర్‌, లచ్చిరెడ్డి, ముత్యాల భాస్కర్‌, నాయిని సత్యనారాయణ, దండె శ్రీశైౖలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:11 AM