Share News

అర్ధరాత్రి బాలుడి కిడ్నాప్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:10 AM

తల్లిఒడిలో నిద్రిస్తున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తాండూరు మండలం గౌతాపూర్‌లోని మల్లికార్జునస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

అర్ధరాత్రి బాలుడి కిడ్నాప్‌

తాండూరు రూరల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తల్లిఒడిలో నిద్రిస్తున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తాండూరు మండలం గౌతాపూర్‌లోని మల్లికార్జునస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్‌ కు చెందిన భాషా, గోర్‌బీ దంపతులకు షమీనా, ఇమామ్‌, ముఖ్థుం, రజని, హుస్సేన్‌(1) సంతానం ఉన్నారు. అయితే గౌతాపూర్‌ గ్రామానికి ఇటీవల వలస వచ్చారు. గ్రామంలోని మల్లికార్జునస్వామి ఆలయం ఆవరణలో ఉంటూ గ్యాస్‌స్టవ్‌ రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆలయ ఆవరణలో పిల్లలతో కలిసి నిద్రించారు. గోర్‌బీ తన ఏడాది కుమారుడు హుస్సేన్‌ను పక్కనే చీర కొంగుకు కట్టుకుని నిద్రించింది. తెల్లవారుజామున లేచి చూసేసరికి హుస్సేన్‌ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల మొత్తం వెతికారు. అయినా కనిపించకపోవడంతో కరన్‌కోట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి గౌతాపూర్‌ గ్రామాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా బాలుడి ఆచూకీని త్వరలోనే గుర్తిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 12:10 AM