Share News

కూరగాయ పంటలతో ఖుషీ!

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:05 AM

ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో భూగర్భజల మట్టాలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్లుగా చెరువులు, కుంటలు పూర్తిగా నిండకపోవడంతో నీటి కొరత ఏర్పడింది.

కూరగాయ పంటలతో ఖుషీ!
అయ్యవారిగూడలో మల్చింగ్‌, డ్రిప్‌తో సాగు చేస్తున్న వంకాయ, పచ్చి మిర్చి తోటలు

తక్కువ నీరు అవసరమయ్యే సాగువైపు రైతుల మొగ్గు

భానుడి తీవ్రతకు ఎండుతున్న చెరువులు, కుంటలు

గణనీయంగా పడి పోయిన భూగర్భ జలాలు

ఆగి ఆగి పోస్తున్న బోర్లు

డ్రిప్‌, మల్చింగ్‌ పద్ధతిలో సాగుతో ఊరట

యాచారం, మార్చి 19 : ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో భూగర్భజల మట్టాలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్లుగా చెరువులు, కుంటలు పూర్తిగా నిండకపోవడంతో నీటి కొరత ఏర్పడింది. వరి పంటలు చేతికందుతాయా? లేదా? అని రైతులు తల్లడిల్లుతున్నారు. యాచారం మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 116 చెరువులు, కుంటలున్నాయి. దాదాపు అవన్నీ ఎండిపోయే స్థితికొచ్చాయి. చాలావరకు వ్యవసాయ బోర్లు ఆగి ఆగి నీరు పోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీరు అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయ తోటలు సాగు చేయడం ఉత్తమమని భావించారు. దాదాపు 413 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. భూగర్భజలం పడిపోవడంతో వరి పంటలపై ఆశలు వదులుకొని ఆరుతడి పంటలను డ్రిప్‌, మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేస్తున్నారు. టమాట, వంకాయ, మిర్చి, సొరకాయ, బీరకాయ, కాకర, పొట్ల, బెండ, శ్యామగడ్డ, ఉల్లిగడ్డ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌. పుదీన, పాలకూర, కొత్తిమీర, తోటకూర, చిక్కుడు, పచ్చిమిర్చి తదితర పంటలు సాగు చేశారు. కాగా, ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వకపోయినా డ్రిప్‌, మల్చింగ్‌కు సంబంధించిన పరికరాలతో సాగు చేస్తూ నీటిని పొదుపుగా వాడుతున్నారు. గడ్డమల్లాయగూడ, చౌదర్‌పల్లి, అయ్యవారిగూడ, ధర్మన్నగూడ, మొండిగౌరెల్లి, నందివనపర్తి, నల్లవెల్లి, గున్‌గల్‌, కుర్మిద్ద, యాచారం, మేడిపల్లి తదితర గ్రామాల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు అధికంగా చేస్తున్నారు. నగరంలోని కొత్తపేట రైతుబజార్‌, ఎల్బీనగర్‌, మాదన్నపేట, మోండా మార్కెట్‌లకు కూరగాయలు తరలిస్తున్నారు. ఎకరం భూమిలో వంకాయ, పచ్చిమిర్చి తోటల సాగుకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టగా.. డ్రిప్‌, మల్చింగ్‌కు రూ.50వేల వ్యయం చేసినట్లు అయ్యవారిగూడకు చెందిన రైతు లింగం తెలిపారు. ధర్మన్నగూడలో కొందరు రైతులు అరెకరం పొలంలో టమాట సాగు చేసి రూ.లక్ష వరకు లాభం గడించినట్లు తెలిపారు. టమాట సాగుతో ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు. పంట మార్పిడి ఎంతగానో ఉపయోగపడిందని చెబుతున్నారు.

కూరగాయలు, ఆకు కూరలతో లాభాలు : బొడ్డు ఐలమ్మ, మహిళా రైతు, గడ్డమల్లాయగూడ

టమాట, సొరకాయ, వంకాయ బెండ తోటలు వేశాం. నీటి కొరత వల్ల డ్రిప్‌, మల్చింగ్‌ పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. చెరువులు, కుంటలు నిండకపోవడంతో బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. నీటి కొరత తీవ్రంగా ఉంది. కొత్తపేటలోని రైతుబజార్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం.

అరెకరం సాగుతో రూ.లక్ష లాభం : రఘుపతి, రైతు, ధర్మన్నగూడ

డ్రిప్‌ సాయంతో అరెకరంలో టమాట సాగు చేసి రూ.లక్ష లాభం గడించాను. బోరు ఆగి ఆగి పోస్తుండటంతో డ్రిప్‌ సాయంతో సాగు చేశాను. పశువుల ఎరువు మాత్రమే వాడాము. ఎలాంటి రసాయన మందులూ వాడలేదు. శ్రీవరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది.

Updated Date - Mar 20 , 2024 | 12:05 AM