కమ్మదనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ప్రారంభయమ్యేనా?
ABN , Publish Date - May 24 , 2024 | 12:06 AM
ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు
వినియోగంలోకి వస్తే విద్యార్థులకు విహార యాత్రలు
చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వినోదం
అది 860 ఎకరాల అడవి. గతంలో ఈ అడవిలో లేళ్లు, దుప్పులు లాంటి అనేక జంతువులు ఉండేవి. కానీ, ఇవన్నీ ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వన సంరక్షణ సమితులు ఉన్నపుడు అమెరికా అధ్యక్షుడు కూడా దీనిని సందర్శించి అభివృద్ధికి నిధులు కూడా కేటాయించారు. ఈ అడవిని అర్బన్ ఫారెస్టు పార్కుగా అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించిన గత ప్రభుత్వం కొన్ని పనులను కూడా చేపట్టింది. అయితే, ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ పార్కును ప్రారంభిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
షాద్‌నగర్ రూరల్, మే 23: ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. కమ్మదనం అడవి 860 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చెందుతుండటంతో భవిష్యత్ తరాలకు పచ్చని అందాలు పంచనుంది. అంతేగాకుండా అడవికి పూర్వ వైభవం రానుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడవులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేయాలని భావించి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పనులను పూర్తి చేసింది. అయినా, అది ప్రారంభానికి నోచుకోవడం లేదు. అడవి చుట్టూ 11.9 కిలో మీటర్ల పొడవునా ప్రహరీ నిర్మాణం జరిగింది. అడవిలో మట్టి రోడ్లను నిర్మించడంతో పాటు చుట్టూ మూడు మీటర్ల వెడల్పుతో నడిచేందుకు వీలుగా మరో దారిని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వన సంరక్షణ సమితులు రద్దయిన తర్వాత అడవి పూర్తిగా అంతరించి పోయింది. ప్రస్తుతం అడవిలో జంతువుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి పోయింది. పార్కు ఏర్పాటు వల్ల జంతువలు సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్బన్ ఫారెస్టు నిర్మాణంలో భాగంగా పార్కులో 20మంది కూర్చోవడానికి వీలుగా అందమైన నిర్మాణం చేశారు. విహార యాత్రకు వచ్చే విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వీలుగా మరో షెడ్డు కూడా నిర్మించారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి దృష్టికి కమ్మదనం అడవి...
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కమ్మదనం అడవిలో ఏర్పాటు చేసిన వన సంరక్షణ సమితుల సమావేశానికి అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్పెన్‌సన్‌ను నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకువచ్చారు. అడవి అందాలను చూసి ఉల్ఫెన్‌సన్ మురిసి పోయారు. అడవి అభివృద్ధికి ప్రపంచ భ్యాంకు నిధులను కూడా మంజూరు చేశారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో కమిటీలు రద్దయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ విలువైన కలప దొంగల పాలైంది. ఏపుగా పెరిగిన టేకు. జిట్రేగి, ఇతర అడవి సంపద కనుమరుగైంది. అనంతర కాలంలో అడవి నిర్లక్ష్యానికి గురి కావడంతో అడవిలో ఉన్న లేళ్లు, దుప్పులు, ఇతర జంతువులు చాలావరకు బయటికి వెళ్లి పోయాయి. మళ్లీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వారాంతాల్లో సేద దీరడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందువల్ల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పార్కును త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించి త్వరలో ప్రారంభిస్తాం : వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
కమ్మదనం ఫారె్‌స్టలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. అడవి జంతువులకు నీటి వసతి కల్పించాల్సి ఉంది. విహార యాత్రకు వచ్చే వారికి కూడా సౌకర్యాలు లేవు. నేను పార్క్‌ను సందర్శించాను. కేవలం రోడ్డు వేశారు కాని ఇతర వసతులు ఏర్పాటు చేయలేదు. డీఎ్‌ఫవోతో మాట్లాడి సంబంధిత మంత్రితో నిధులు మంజూరు చేయించి త్వరగా మిగతా పనులు పూర్తి చేసి పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.