Share News

‘జన’ జాతర

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:06 AM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో నిర్వహించిన ‘జనజాతర’ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చారు.

‘జన’ జాతర

లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కాంగ్రెస్‌

హాజరైన అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

జాతీయ మేనిఫెస్టో విడుదల

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

ఉత్సాహాన్ని నింపిన నేతల ప్రసంగాలు

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో నిర్వహించిన ‘జనజాతర’ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తుక్కుగూడలో ఎక్కడ చూసినా జనసందడే కనిపించింది. అశేషజనం తరలిరావడంతో తుక్కుగూడ రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సభా వేదికకు వచ్చే సమయానికే ప్రాంగణం జనంతో కిక్కిరిసింది. దీంతో రోడ్ల మీదే వేలాదిగా జనం ఉండిపోయారు. పార్టీ జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాజీవ్‌ గాంధీ సభా ప్రాంగణం వేదిక నుంచే రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. సభకు అంచనాలకు తగ్గట్టుగా జనం హాజరుకావడంతో కాంగ్రెస్‌ నేతలు సంబరపడుతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌/మహేశ్వరం/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్‌/షాద్‌నగర్‌, ఏప్రిల్‌ 6 : రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు జనం జేజేలు పలికారు. రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఆయనతో పాటు పలువురు జాతీయ నేతలు, ఇతర రాష్ర్టాల ముఖ్యనాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో జరిగిన సభలోనే ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఈ గ్యారంటీలకు ప్రజల్లో మంచి స్పందన రావడంతోపాటు, పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. లోక్‌సభ ఎన్నికల శంఖరావాన్ని పూరించింది. ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈనెల 5న పార్టీ జాతీయ మేనిఫెస్టో ఢిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్‌ విడుదల చేశారు. అందుకు సంబంధించి తెలుగుప్రతిని సభా వేదికపై అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేసి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, పొన్నంప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విడుదల చేశారు. వంద రోజుల్లో సాధించిన వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి సభలో వివరించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో చేసిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు. అధినేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం పార్టీ శ్రేణులను ఆకట్టుకుంది. రాష్ట్రం నుంచి చిన్న పిల్లోడు పిలిచినా ఇక్కడికి వస్తానని రాహుల్‌ మాట ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు గట్టివార్నింగ్‌ ఇచ్చారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తానని మాట తప్పిన కేసీఆర్‌కు.. చెర్లపల్లి జైలులో డబుల్‌బెడ్‌ రూం ఇల్లు కట్టిస్తానంటూ హెచ్చరించారు.

14 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలి : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

తెలంగాణలో 14 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. 17స్థానాల్లో 14 స్థానాలను గెలిపిస్తే.. అభివృద్ధ్ది సాధ్యమని అన్నారు. తుక్కుగూడ సెంటిమెంటుగా మరోసారి కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిందన్నారు. పదేళ్ల పాలనకు ఇక్కడ నుంచే పులిస్టాప్‌ పడిందని, ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని అన్నారు.

కేసీఆర్‌ గడీల పాలనను బద్దలు కొట్టాం: డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

కేసీఆర్‌ గడీల పాలనను బద్దలు కొట్టామని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. దేశంలో యువత కాంగ్రెస్‌ వైపు చూస్తోందన్నారు. బీజేపీ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు తుక్కుగూడలో జనజాతర నిర్వహించామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన అంతమైందని, ఇక మిగిలింది బీజేపీయేనన్నారు. బీజేపీ మత వైఖరితో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు దూరంగా ఉండండి : ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు దూరంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. ఓ వైపు ప్రాంతీయ శక్తులు, మరో వైపు మతతత్వ శక్తులు సమాజాన్ని విభజించి రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అవినీతి తప్పా ఏమీలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు దీక్షభూని, ప్రమాణం చేసి ఒక్కొక్కరు వంద ఓట్లు తీసుకువచ్చి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి వెనక్కి : మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి

కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి పట్టుకొమ్మలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు భరించారన్నారు. మల్కాజిగిరి ప్రజలను కోరేది ఏమిటంటే.. నన్ను నాన్‌లోకల్‌ అంటున్నారు. నేను నాన్‌లోకల్‌ కాదు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నాను. వేల కోట్లతో జిల్లాను అభివృద్ధ్ది చేశానని చెప్పారు. 2006లో నేను చేసిన అభివృద్ధి ఎంతో ఉందన్నారు. ఒక్కసారి అవకాశమివ్వాలని, అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయకుంటే.. అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్తుందన్నారు.

మరోసారి అవకాశం ఇవ్వండి : చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

మరోసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధ్దితో పాటు విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. 75ఏళ్ల స్వాతంత్య్రం తరువాత పేదల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. పేదల సంక్షేమం వద్దూ.. కార్పొరేట్‌ సంక్షేమం ముద్దు అని బీజేపీ అంటుందని తెలిపారు. చేవెళ్ల గడ్డపై కూరగాయల నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. మరోసారి మీ ముందు నిలబడ్డా.. ఎంపీగా గెలిపించాలని కోరారు.

14 ఎంపీ సీట్లు సోనియమ్మకు బహుమతిగా ఇద్దాం : మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌

కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేసిండని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడలో జనజాతర సభ జరపడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని తెలిపారు. ఇన్నాళ్లు ఫాంహౌ్‌సలో పడుకున్న కేసీఆర్‌కు మళ్లీ ఎంపీ ఎన్నికలు రావడంతో రైతులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీలో గెలిపించాలని కోరారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ లేకుండా పోతుందన్నారు. మాటిస్తే.. మడమ తిప్పం... ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అమలు చేస్తున్నాం. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ చెప్పిందే చేస్తుంది : బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత

కాంగ్రెస్‌ చెప్పిందే చేస్తుందని బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాతనర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని కొంతమంది బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు హేళన చేస్తున్నారని, పదేళ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు లేనిపోని మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. జనజాతర సభ ద్వారా దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

కాంగ్రె్‌సతోనే సెక్యులరిజం సాధ్యం : మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

కాంగ్రె్‌సలో సెక్యులరిజం సాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. దేశంలో సెక్యులరిజం కాపాడేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో మత విద్వేషాలను రెచ్చగొట్టారని, వాటిని రాహుల్‌ పాదయాత్ర ద్వారా రూపుమాపారన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు.

విర్రవీగుతున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పారు : భువనగిరి ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్‌కుమార్‌రెడ్డి

విర్రవీగుతున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని భువనగిరి ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎలా తరిమి కొట్టారో ఆలాగే ప్రధాని మోదీని తరిమి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని, బీఆర్‌ఎ్‌సను, బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు.

బీజేపీకి మత పిచ్చి పెరిగి పోతుంది : జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి

బీజేపీకి మత పిచ్చి పెరిగిపోతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ మతం పేరుతో ముందుకెళ్తుందని, నిరుద్యోగం గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా గెలిపించుకోవాలని కోరారు. ప్రజలు ఆలోచించి ఎంపీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు.

సభలో పోలీసుల భారీ బందోబస్తు

తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ జన జాతర సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనటలు జరకుండా వేయి మంది పోలీస్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇది గాక సభా వేదిక నలుమూల కేంద్ర బలగాలచే భారీ భద్రత కొనసాగింది.

సభ సైడ్‌లైట్స్‌

ఇబ్రహీంపట్నం/ కందుకూర్‌/ మహేశ్వరం/ చౌదరిగూడ ఏప్రిల్‌ 6: తుక్కుగూడలో శనివారం సాయంత్రం జరిగిన జనజాతర సభకు ఎండను సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా జనం తరలి వచ్చారు.

6:30 గంటలకు స్థానిక నాయకులతో జనజాతర సభ ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ప్రసంగించారు.

6:43 గంటలకు మంత్రి కొండా సురేఖ ప్రసంగించారు

6:48 గంటలకు మంత్రి సీతక్క ప్రసంగించారు

6:54 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌

7:00 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు

7:05 గంటలకు మంత్రి శ్రీధర్‌బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా...

7:07గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క, ఏఐసీసీప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవవరాలఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సభ వేదికపైకి వచ్చారు.

7:17 గంటలకు అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు.

7:20 గంటలకు రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని మొదలుపెట్టి 7:58 ముగించారు.

8:00 గంటలకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించి నిమిషంలోనే ముగించారు.

8:01 గంటలకు ఉప ముఖ్యమంత్రి మలు ్లభట్టి విక్రమార్క ప్రసంగించారు.

8.08 గంటలకు మొదలైన సీఎం రేవంత్‌ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించగా

8:27గంటలకు ప్రసంగం ముగించారు. దీంతో జన జాతర సభ ముగిసింది.

Updated Date - Apr 07 , 2024 | 01:33 AM