భయం గుప్పిట్లో జలాల్‌పూర్
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:36 AM
మండలంలోని జలాల్‌పూర్ గ్రామం భయం గుప్పిట్లో మగ్గుతోంది.
బషీరాబాద్, జూలై 18: మండలంలోని జలాల్‌పూర్ గ్రామం భయం గుప్పిట్లో మగ్గుతోంది. మొహర్రం పండుగ వేడుకల్లో మంగళవారం అసైదులా ఆడుతుండగా పాత కక్షలతో తలెత్తిన గొడవలో ఇరు కుటుంబాల దాయాదులు రెచ్చిపోయి చక్రాల కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని భయానక వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామంలో చక్రాల కత్తులు, కర్రలను ఉపయోగించి రెండు కుటుంబాల వ్యక్తులు మొహర్రం పండుగలో దాడులకు దిగడంతో గాయాలవడం ప్రత్యక్షంగా చూసిన స్థానిక జనానికి భయం వీడటంలేదు. ఎప్పడూ లేని విధంగా ఈ ఏడాది మొహర్రం పండుగలో చోటు చేసుకున్న సంఘటనపై గ్రామస్తులు భయకంపితులవుతున్నారు. అందరూ పండగ వాతావరణంలో ఉండగా,ఇరు కుటుంబాల దాయాదులు దాడులను గుర్తుచేసుకుంటూ భయందోళన చెందుతున్నారు. ఆ సమయంలో మహిళలు, చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక ఇళ్లకు పరుగులు పెట్టారని ఇదెక్కడి దాడులంటూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దాయాదుల గొడవలో ఎక్కడికి దారితీస్తుందోనని ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఈ దాడులకు దిగిన పరిసర ప్రాంతంలో రెండోరోజు గురువారం కూడా జనం సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించించడం గమనార్హం. ఇక్కడి ప్రాంతానికి ఎవరైనా కొత్తవారు వస్తే బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోంచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం బషీరాబాద్ ఎస్‌ఐ రమే్‌షకుమార్, సిబ్బందితో గ్రామానికి చేరుకుని దాడులకు పాల్పడిన ఇరు కుటుంబాలతో విచారణ జరిపి వెళ్లారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు పోలీసులు మేమున్నామనే భరోసా కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమైంది. కాగా దాయాదులు చక్రాల కత్తులను పండుగలో అసైదులా ఆడేందుకు స్థానికంగా ఒక వ్యక్తి వద్ద ప్రత్యేకంగా 30 వరకు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చక్రాల కత్తులను పోలీసులకు దొరకకుండా బావిలో పడేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పరస్పర ఫిర్యాదులపై 11మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.