Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 21 , 2024 | 11:35 PM

ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి ఎన్‌.శంకర్‌ తెలిపారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి శంకర్‌

వికారాబాద్‌, మే 21: ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి ఎన్‌.శంకర్‌ తెలిపారు. వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ మెంబెర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు తాగునీరు, నిరంతర విద్యుత్‌ సదుపాయం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి జూన్‌3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వికారాబాద్‌లో ఐదు, తాండూరులో నాలుగు, పరిగిలో నాలుగు పరీక్షా కేంద్రాలను, అదేవిధంగా నవాబుపేట్‌, పెద్దేముల్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, దోమ, కొడంగల్‌, కులకచర్ల మండలాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున మొత్తం 20పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులలో కలిపి 7831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని అన్నారు. మొదటి సంవత్సరం పరీక్ష లకు 4621మంది , రెండవ సంవత్సరం పరీక్షలకు 3210మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్‌, వాచ్‌లు, ఎలకా్ట్రనిక్‌ వస్తువులను అనుమతించకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష సమయంలో మెడికల్‌ సిబ్బంది సరైన మందులతో అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు రాజమోహన్‌రావు, బుచ్చయ్య, ప్రిన్సిపాల్‌లు నర్సింహారెడ్డి, చెన్నయ్య, సురేశ్వరస్వామి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:35 PM