నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 23 , 2024 | 11:30 PM
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం ఫస్టియర్.. మధ్యాహ్నం సెకండియర్ పరీక్ష
పరీక్షలు కొనసాగే సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్
వికారాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వమిస్తారు. జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులు కలిపి మొత్తం 7,831 మంది సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఫస్టియర్‌కు 4,621, సెకెండియర్ పరీక్షలకు 3,210 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు 20కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లో 5, తాండూరు 4, పరిగి 4, నవాబ్‌పేట్, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్‌పేట్, దోమ, కొడంగల్, కులకచర్ల మండల కేంద్రాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులను అనుమతించరు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లు మూసేయిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
మేడ్చల్ జిల్లాలో 89 పరీక్ష కేంద్రాలు
మేడ్చల్(ఆంధ్రజ్యోతి) : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జిల్లా మెరుగైన ఫలితాలనే సాధించినా పలు ప్రభుత్వ కళాశాలల కొంత నిరాశపర్చాయి. పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఫైయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వ కళాశాలలు సెలవుల్లోనూ విద్యార్థుల సందేహాలు తీరుస్తూ పరిమితంగా బోధన సాగించాయి. కాగా మేడ్చల్ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 89 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 36,940 మంది, ద్వితీయ సంవత్సరంలో 13,503 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసింది. పరీక్షలకు 89 చీఫ్ సూపరిండెంట్‌లను, 89 మంది డిపార్టుమెంటల్ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సామగ్రిని కూడా అధికారులు కేంద్రాలకు పంపిణీ చేశారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్లు వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ్టటఛజ్ఛీ.ఛిజజ.జఠిౌ.జీుఽ నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కిషన్ తెలిపారు. వాటిపై కళాశాల ప్రిన్స్‌పాల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తారని పేర్కొన్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే ఒత్తిడి లేకుండా పరీక్ష రాయవచ్చని ఆయన సూచించారు.
ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ : కిషన్, జిల్లా ఇంటర్ విద్యాధికారి, మేడ్చల్
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. 89పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలి. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలి. ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలి.