Share News

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటు బ్యాంకు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:11 AM

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో కాషాయ దళంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటు బ్యాంకు

వికారాబాద్‌, జూన్‌4 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో కాషాయ దళంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని కాంగ్రెస్‌, బీజేపీలు హోరాహోరీగా శ్రమించగా, ఓటర్లు బీజేపీకి పట్టంగట్టారు. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం కమల దళంలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాబోయే మునిసిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, పీఏసీఎస్‌ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుకోవాలని కాషాయ దళం ఇప్పటి నుంచే సంసిద్ధమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో బీజేపీ తన సత్తా చాటుకుంది. జిల్లాలో కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తన సత్తా చాటుకోగా, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో బీజేపీ మెజార్టీ సాధించింది. గత నవంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి ఊహించని విధంగా ఓటు బ్యాంకు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో 27,872 ఓట్లు సాధించగా, లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 1,93,467 ఓట్లు సాధించి తన సత్తా చాటుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గంలో 7,132 ఓట్లు కైవసం చేసుకుని 4.09 శాతం ఓట్లు దక్కించుకోగా, ఈ ఎన్నికల్లో 67,435 ఓట్లు సాధించి పోలైన ఓట్లలో బీజేపీ 41.32 శాతం కైవసం చేసుకుంది. అదే తాండూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 4,087 ఓట్లతో 2.33 శాతం దక్కించుకోగా, ఈ ఎన్నికల్లో 77,654 ఓట్లు దక్కించుకుని 47.42 శాతం ఓట్లతో సత్తా చాటుకుంది. అదే పరిగి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 16,653 ఓట్లు సాధించి 8.26 శాతం ఓట్లు దక్కించుకోగా, ఈ ఎన్నికల్లో 74,024 ఓట్లు కైవసం చేసుకుని 41.43 శాతం దక్కించుకుని రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇస్తామంటూ సవాల్‌ విసిరింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చాలా వరకు పుంజుకున్నట్లు సాధించిన ఓట్ల ద్వారా స్పష్టమవుతోంది. కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత బలపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ఈసారి బీజేపీ అధిష్టానం దృష్టి సారించడంతో ఆశించిన ఫలితాలు సాధించగలిగామనే ఉత్సాహం కాషాయదళంలో వ్యక్తమవుతోంది.

================

Updated Date - Jun 05 , 2024 | 12:11 AM