Share News

అసంపూర్తి భవనాలు.. విద్యార్థుల అగచాట్లు

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:47 PM

ఐదు తరగతులు.. ఏడుగురు విద్యార్థులు.. ఒక డిప్యుటేషన్‌ ఉపాఽధ్యాయుడు.. పాఠశాలకు భవనం మంజూరయ్యాక మరో భవనానికి పచ్చజెండా.. తీరా చూస్తే ఆ రెండు భవనాలూ అసంపూర్తి. వెరసి అధికారులు చేసిన పొరపాటు విద్యార్థులకు గ్రహపాటుగా మారింది. వివరాల్లోకి వెళితే..

అసంపూర్తి భవనాలు.. విద్యార్థుల అగచాట్లు
డీపీఈపీ నిధులతో చేపట్టిన భవనం, శిథిలావస్థకు చేరిన దృశ్యం

అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం

ఒకటి ఉండగా మరో భవన నిర్మాణానికి సిద్ధం

డీపీఈపీ, ఆర్వీఎం కింద వేర్వేరుగా మంజూరు..

ఏ ఒక్కటీ పూర్తికాని వైనం.. విద్యార్థుల అవస్థలు

కొందుర్గు మండలం తంగళ్లపల్లి పాఠశాల దుస్థితి

ఒక ఉపాధ్యాయుడు.. ఏడుగురు మాత్రమే విద్యార్థులు

కొందుర్గు, జనవరి, 28: ఐదు తరగతులు.. ఏడుగురు విద్యార్థులు.. ఒక డిప్యుటేషన్‌ ఉపాఽధ్యాయుడు.. పాఠశాలకు భవనం మంజూరయ్యాక మరో భవనానికి పచ్చజెండా.. తీరా చూస్తే ఆ రెండు భవనాలూ అసంపూర్తి. వెరసి అధికారులు చేసిన పొరపాటు విద్యార్థులకు గ్రహపాటుగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని తంగళ్లపల్లిలోని దళితవాడలో 2001 ఆగస్టులో ఓ ప్రైవేట్‌ గదిలో 25 మంది విద్యార్థులు, ఒక వాలంటీర్‌తో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సంవత్సరం తరువాత ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఈక్రమంలో 2002 మార్చిలో డీపీఈపీ(డిస్ర్టిక్ట్‌ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం) నుంచి 1.90 లక్షలతో పాఠశాలకు భవనం మంజూరైంది. పునాదులను ఓ కాంట్రాక్టర్‌, గోడలను మరొకరు, స్లాబ్‌ను ఇంకొకరు నిర్మించారు. నిధులు సరిపోవడం లేదంటూ ముచ్చటగా ముగ్గురు భవన నిర్మాణాన్ని అర్ధంతరంగా వదిలేశారు. భవనానికి ప్లాస్టింగ్‌, ఫ్లోరింగ్‌ చేయకుండానే వదిలివేశారు. ఆ భవనంలోనే 5 తరగతులకు కలిపి 7మంది విద్యార్థులకు.. చెక్కలోనిగూడెం పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయుడితో విద్యాభోధన కొనసాగుతోంది. కాగా, ఆ భవనం కాస్త శిథిలావస్థకు చేరుకుంటోంది. అయితే, దళిత వాడ పాఠశాల అసంపూర్తి భవనంలోనే కొనసాగుతుండగా.. ప్రభుత్వం 2012లో ఆర్వీఎం(రాజీవ్‌ విద్యా మిషన్‌) నుంచి రూ.5లక్షలు వెచ్చింది మరో భవనాన్ని మంజూరు చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పిల్లర్స్‌, స్లాబ్‌ వేసి, భవన నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. దాంతో ఆ భవనం కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. అదేవిధంగా రెండోసారి కడుతున్న పాఠశాల భవనానికి పక్కనే విద్యార్థుల కోసం మరుగుదొడ్లను సైతం నిర్మించారు. ప్రస్తుతం అవి కూడా శిఽథిలావస్థకు చేరుకున్నాయి. కాగా, భవన నిర్మాణం చేపట్టి సరిపడా టీచర్లను నియమిస్తే విద్యార్థులు సంఖ్య ఎక్కువగా ఉండేదని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం

పాఠశాల భవనం నిర్మాణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన పొరపాటు విద్యార్థులకు గ్రహపాటుగా మారింది. మొదటి భవనం నిర్మాణ దశలో ఆగిపోయింది. దానిని పూర్తి చేయకుండా, అదే పాఠశాలకు మరో భవనాన్ని మంజూరుచేయడం అధికారుల అనాలోచిన నిర్ణయానికి నిదర్శనం. ఈ విషయంలో ప్రజాప్రతినిఽధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. రెండు భవనాల్లో ఏ ఒక్కటీ పూర్తికాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీపీఈపీ, ఆర్వీఏం అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రెండు భవనాలు అసంపూర్తిగా మిగిలాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అసంపూర్తి భవనాల నిర్మాణ పనులను పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని దళితవాడ వాసులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే సారూ... భవనాలను పూర్తి చేయించండి

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే భవన నిర్మాణాలపై దృష్టిసారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 22 ఏళ్లుగా పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు భవనాలు మంజూరైనా.. ఏ ఒక్కటీ పూర్తికాలేదని, కొత్త ఎమ్మెల్యే భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయించాలని దళితవాడ ప్రజలు కోరుతున్నారు.

పిల్లలను ఎవరూ బడికి పంపడం లేదు

మా గ్రామంలో ఉన్న రెండు పాఠశాల భవనాల్లో ఏదో ఒక భవనాన్ని వెంటనే పూర్తిచేయాలి. గ్రామంలో మరో 10 మంది బడీడు పిల్లలున్నారు. పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులను బడికి పంపడం లేదు. అధికారులు చొరవ తీసుకోవాలి.

- ఎ.అంతమ్మ, తంగెళ్లపల్లి, దళితవాడ, మధ్యాహ్న భోజన కార్మికురాలు

శిథిలావస్థలో మొదటి భవనం

పాఠశాలకు సరైన భవనం లేక ఇబ్బంది మారింది. రెండు భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మొదటి భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. రెండో భవనం అసంపూర్తిగా ఉంది. ఏదో ఒక భవనమైనా, పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలి. బడికి విద్యార్థులను పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

- రాజ్యవర్థన్‌రెడ్డి, ఉపాధ్యాయుడు

గతంలో అధికారులు, ఎమ్మెల్యేకు విన్నవించాం

22 ఏళ్ల క్రితం భవనం మంజూరైంది. ముగ్గురు కాంట్రాక్టర్లు పనులు చేశారు. కానీ, భవనం పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలింది. 2012లో మరోసారి రెండో భవనం మంజూరైంది. అదికూడా పూర్తికాలేదు. ఈ విషయమై ప్రతీసారి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ దృష్టికి తీసుకెళ్లాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం.

- కె.బాల్‌రాజ్‌, సర్పంచ్‌, తంగళ్లపల్లి

నిధులు మంజూరైతేనే నిర్మాణం..

మొదటి భవనానికి బిల్లులు సరిగ్గా అందలేదని తెలిసింది. రెండో భవనాన్ని కాంట్రాక్టర్‌ సకాలంలో పూర్తి చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. మళ్లీ నిఽధులు మంజూరైతే ఆ రెండు భవనాలనూ పూర్తి చేయవచ్చు. అయితే, కనీసం ఒక భవనమైనా వినియోగంలోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

- కిష్టారెడ్డి, ఎంఈవో, కొందురు

Updated Date - Jan 28 , 2024 | 11:55 PM