Share News

చైన్‌ స్నాచింగ్‌ కేసులో

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:39 PM

చైన్‌స్నాచింగ్‌ కేసులో ముగ్గురు నిందితులను నాగోల్‌ పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్థులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం..

చైన్‌ స్నాచింగ్‌ కేసులో

ఇద్దరు పాత నేరస్థులు, విద్యార్థి అరెస్టు

5 తులాల బంగారు గొలుసు, 3 సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం

కొత్తపేట, జూన్‌ 3 : చైన్‌స్నాచింగ్‌ కేసులో ముగ్గురు నిందితులను నాగోల్‌ పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్థులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల ఒకటో తేదీన మరిపల్లిలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెల గొలుసును తెంచుకుని బైకుపై పరారైన ఇద్దరు నిందితులను నాగోల్‌ పోలీసులు ఈనెల 2న గౌరెల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మరో నిందితుడు వారికి సహకరించినట్లు తేలడంలో అతడినీ అరెస్టు చేశారు. 5 తులాల బంగారు పుస్తెల గొలుసు, 3 సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. 2018లో ఆదిభట్ల పీఎస్‌ పరిధిలో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నల్లగొండకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మునగాల శివారెడ్డి(28), గతేడాది మీర్‌పేట పీఎస్‌ పరిధిలో మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన నల్లగొండ కనగల్‌ మండల్‌ బాబాసాహెబ్‌ గూడెంకు చెందిన సుంకిరెడ్డి శశిధర్‌రెడ్డి అలియాస్‌ శశిధర్‌(30), నల్లగొండ శ్రీనగర్‌ కాలనీకి చెందిన దేవులపల్లి సాయి కుమార్‌రెడ్డి(20) స్నేహితులు. సాయికుమార్‌రెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురూ ఎల్‌బీనగర్‌ పరిధి ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటున్నారు. ఈక్రమంలో వారు జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాటపట్టారు. దాంతో ఒకటో తేదీన మరిపల్లిలో శశిధర్‌రెడ్డి, సాయికుమార్‌రెడ్డి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి పరారయ్యారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి, నిందితులను పట్టుకున్నారు. నిందితులను సోమవారం రిమాండుకు తరలించారు.

Updated Date - Jun 03 , 2024 | 11:39 PM