ప్రజా నిర్ణయం మేరకే ‘రైతు భరోసా’ అమలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:37 AM
ప్రజల నిర్ణయం మేరకే రైతు భరోసాను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో కొందుర్గు, జిల్లేడ్-చౌదరిగూడ మండలాల రైతులతో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసాపై రైతులు, ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు గాను సమీక్ష సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

కొందుర్గు/ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు, జూలై 4: ప్రజల నిర్ణయం మేరకే రైతు భరోసాను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో కొందుర్గు, జిల్లేడ్-చౌదరిగూడ మండలాల రైతులతో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసాపై రైతులు, ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు గాను సమీక్ష సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులందరూ దాదాపు 80 శాతం మంది.. 10 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కోరారని ఎమ్మెల్మే తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. చైర్మెన్ దామోదర్‌రెడ్డి, నాగలింగాచారి, సరస్వతి, తదితరులున్నారు. ఇబ్రహీంపట్నం పరిధి ఉప్పరిగూడ పీఏసీఎస్ ప్రత్యేక సమావేశం శేరిగూడలోని సంఘ భవనంలో సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి ధాత్రీదేవి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఐదెకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కొందరు, పదెకరాల వరకు ఇవ్వాలని మరికొందరు ప్రస్తావించారు. రైతు భరోసాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐటీ కడుతున్న రైతులకుకూడా దీనిని వర్తింపజేయాలని రైతు నాయకుడు మొద్దు అంజిరెడ్డి అన్నారు. అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు డీసీవో ధాత్రీదేవి తెలిపారు. సమావేశంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా పంటలు సాగు చేసే భూములన్నింటికి రైతుభరోసా సాయం అందించి ఆదుకోవాలని పీఏసీఎ్‌స్ చైర్మన్ వెంకటేశ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. డీఆర్‌ఏవో నాగలింగాచారి,డీఎల్‌సీవో శారద తదితరులు హాజరయ్యారు.