Share News

పాడైన రోడ్లపై ప్రయాణమెలా?

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:33 PM

ఫరూఖ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల రహదారులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

పాడైన రోడ్లపై ప్రయాణమెలా?
కంకర తేలిన కిషన్‌నగర్‌ నుంచి విఠ్యాల వెళ్లే రోడ్డు

గుంతలతో వాహనదారుల ఇక్కట్లు

వర్షాలకు దెబ్బతిన్న రహదారులు

మరమ్మతులకు నోచుకోని వైనం

పట్టని ప్రజాప్రతినిధులు, అధికారులు

షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఫరూఖ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల రహదారులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోడ్ల నిర్మాణంలో భాగంగా దశాబ్దాల క్రితం కంకర వేసి మరిచారు. నేటికీ కనీసం మరమ్మతులు చేయకపోవడంతో కంకర తేలి కాలినడకన వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్డు వర్షానికి కోసుకుపోయి కాలువలను దర్శనమిస్తున్నాయి. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నారు. కంకర పూర్తిగా లేచిపోయి కనీసం కాలిబాటన కూడా నడవలేని విధంగా ఉన్నాయి. కనీసం మట్టి పోయించి మరమ్మతులు చేపట్టాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కిషన్‌నగర్‌-విఠ్యాల రోడ్డుపై తేలిన కంకర

కిషన్‌నగర్‌ నుంచి విఠ్యాల వరకు సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 30 ఏళ్ల క్రితం కంకర రోడ్డు వేశారు. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

అధ్వానంగా రామేశ్వరం రోడ్డు

పవిత్ర పుణ్యక్షేత్రమైన రామేశ్వరం రోడ్డు కూడా బీటీ తేలిపోయి అధ్వానంగా మారింది. జాతీయ రహదారి రాయికల్‌ గేట్‌ నుంచి రామేశ్వరం-విఠ్యాల వరకు బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. కొన్నిచోట్ల మట్టి రోడ్డును తలపిస్తోంది. అడుగడుగునా గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. మలుపుల వద్ద గోతులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. జోగమ్మగూడ శివారులో రోడ్డు చాలా ప్రమాదకరంగా మారి మట్టి రోడ్డును తలపిస్తోంది. నిత్యం రామేశ్వరం శివాలయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తుంటారు. అయినా రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

ప్రమాదకరంగా పరిగి-కిషన్‌నగర్‌ రోడ్డు

పరిగి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కిషన్‌నగర్‌ వెళ్లే బీటీ రోడ్డు ఇరువైపులా కోసుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇచ్చేందుకు ద్విచక్రవాహనాలు కిందికి దిగితే మళ్లీ రోడ్డుపైకి రావాలంటే ఇబ్బందులు పడాల్సిందే. వర్షానికి రోడ్డుకిరువైపులా మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డు కూడా కోసుకుపోయింది. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకిరువైపులా మట్టిపోస్తే కొంత వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహనదారులు, గ్రామస్తులు చెబుతున్నారు.

రోడ్డు మీదుగా వెళ్లలేక పోతున్నాం

కిషన్‌నగర్‌ నుంచి విఠ్యాల వెళ్లే రోడ్డుకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోడంతో కంకర పూర్తిగా తేలిపోయింది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 4 కిలోమీటర్లు ప్రయాణం నరకప్రాయంగా మారింది. మరమ్మతులు చేపట్టాలి.

- ఆంజనేయులు, కిషన్‌నగర్‌

మరమ్మతులు చేపట్టాలి

రామేశ్వరం విఠ్యాల రోడ్డు పాడై అధ్వానంగా మారింది. రాత్రి వేళల్లో గ్రామానికి వెళ్లాలంటే భయమేస్తుంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రీబీటీ చేయాలి. లేకపోతే మరమ్మతులైనా చేపట్టాలి.

- అంజయ్య, విఠ్యాల గ్రామం

Updated Date - Dec 28 , 2024 | 11:33 PM