Share News

తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఆశజూపి..

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:13 AM

ఫైనాన్స్‌ పేరుతో తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న భార్యాభర్తలను అరెస్ట్‌ చేసినట్లు సిద్దిపేట జిల్లా బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌ తెలిపారు.

తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఆశజూపి..

రాయపోల్‌, జనవరి 16: ఫైనాన్స్‌ పేరుతో తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న భార్యాభర్తలను అరెస్ట్‌ చేసినట్లు సిద్దిపేట జిల్లా బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌ తెలిపారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూర్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అయిన భాగవతం శివశంకర్‌, భాగవతం శశికళలు ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ దంపతులు 2022 జనవరి సంవత్సరంలో శామీర్‌పేట్‌ నిధి లిమిటెడ్‌ను అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. గజ్వేల్‌, సిద్దిపేట, ముతంగి, కందుకూరు, దేవరకొండ, నల్గొండలో చిట్టీలు నిర్వహిస్తూ, ఋణాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ రెండు స్కీములను చెబుతూ వచ్చారు. ఎవరైనా కొంత అమౌంట్‌ కడితే 45రోజుల తర్వాత అందుకు వాళ్ళు కట్టిన దానికి పదిరేట్ల నగదు ఇస్తామని, నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్‌లో వేస్తామని చెప్పారు. ఎవరికైనా రుణాలు కావాలంటే వారికి కావాల్సిన రుణాలకు బాండ్‌ పేపర్‌పై రాసుకొని డబ్బు కకట్టకుంటే ఇల్లు, స్థలాలు వారి కంపెనీ పేరుపై బదిలీ చేయించుకుంటున్నారు. దీంతో బాధితుల్లో ఎల్కల్‌ గ్రామానికి చెందిన పిట్ల కృష్ణ, ఇంటేనుక నరసవ్వ, పిట్ల చిన్న వెంకటయ్య, మర్కంటి రాజు, దోనేపల్లీ లింగం ఉన్నారు. వీరి దగ్గర మొత్తంగా రూ.2లక్షల 60వేలు తీసుకుని అందుకు పదిరెట్లు 45రోజుల తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. బాధితులు బేగంపేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శివశంకర్‌, శశికళను అరెస్టు చేసి వారిద్దరి దగ్గర శామీర్‌పేట్‌ నిధి లిమిటెడ్‌కి సంబంధించిన రికార్డులను, బాండ్‌లను, స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్‌ తరలించినట్లు ఎస్‌ఐ అరుణ్‌ తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 12:13 AM