Share News

‘ఇందిరమ్మ’పైనే ఆశలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:53 PM

ఏళ్లుగా ఇల్లు లేని పేదర సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే నిరుపేదలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు.

‘ఇందిరమ్మ’పైనే ఆశలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ‘గృహలక్ష్మి’ రద్దు

ఈ పథకానికి జిల్లాలో అర్హులు 31,169 మంది

నిలిచిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ

ప్రజాపాలనలో వెల్లువెత్తిన దరఖాస్తులు

నిరుపేదల సొంతింటి కల నెరవేరేనా?

ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే గుడిసెలు, కిరాయి ఇళ్లలో ఏళ్లపాటు కాలం ఎల్లదీస్తున్న పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అని, ఎన్నికల సమయంలో గృహలక్ష్మి పథకం అంటూ తెచ్చి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది తప్పితే అమలే కాలేదు. ఆలోపే ఎన్నికలొచ్చాయి. తాజాగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించింది. ఈ నేపథ్యంలో పేదలు ఈ సర్కార్‌పై ఆశలు పెట్టుకున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా ఇల్లు లేని పేదర సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే నిరుపేదలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గతంలో వచ్చిన టీఆర్‌ఎ్‌స(బీఆర్‌ఎస్‌) ప్రభుత్వాలు పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని పదేళ్ల పాటు హామీలు ఇచ్చిందే తప్పితే అర్హుల్లో పది శాతం మందికైనా సొంతిళ్లు కట్టివ్వలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. ఎంపిక చేసిన వారికి 3లక్షల రూపాయల చొప్పున ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో సమయాల్లో మూడు విడతల్లో ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హతను బట్టి ఎంపిక చేసి మొదటి విడతలో జిల్లాలో 22,150 మందికి మొదటి విడత సాయాన్ని అందించాలని దరఖాస్తులను స్వీకరించింది. గృహలక్ష్మి పథకానికి జిల్లాలో 44,985 దరఖాస్తులొచ్చాయి. వాటిలో 31,169 దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ వచ్చే కొన్ని రోజుల ముందు 1,232 మందికి గృహలక్ష్మి మంజూరు పత్రాలను(ప్రోసిడింగ్స్‌) మాత్రం అందించారు. అంతలోనే ఎన్నికలు.. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం.. గృహలక్ష్మి స్కీమ్‌ను రద్దుచేయడంతో ఈ పథకం మూలనపడింది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారిలో అయోమయం మొదలైంది. కొత్త ప్రభుత్వంలో మరోసారి దరఖాస్తు చేయాలా? అన్న సంశయం మొదలైంది. ఈ లోగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వమే షామ్‌లు ఇచ్చి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అలాగే గత ప్రభుత్వంలో పెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ముందుకు సాగలేదు. ఇళ్ల కోసం జిల్లాలో 97,616 నిరుపేదలకు మీసేవల్లో దరఖాస్తు చేశారు. 2015-16-17లో గత సర్కార్‌ 6,777 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా అందులో 6,637 ఇళ్లను నిర్మించేందుకు అనుమతి లభించింది. దీనికి 274.35 ఎకరాల భూమిని కేటాయించారు. 2,293 ఇళ్లకు మౌలిక సదుపాయలు కల్పిస్తున్నారు. పూర్తయిన 2,293 ఇళ్లకు సంబంధించి క్షేత్రస్తాయిలో తహసీల్దార్లు 1,988 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఇప్పటి వరకు గృహాలు కేటాయించలేదు. పేదలు ఇంకా అద్దె ఇంట్లోనే కాలం వెల్లదీస్తున్నారు.

‘గృహలక్ష్మి’కి రాంరాం.. ‘ఇందిరమ్మ’కు జై

ఖాళీ స్థలం ఉండి సొంతిల్లు లేని నిరుపేదలు ఇల్లు కట్టుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మంగళపాడింది. ఈ స్కీమ్‌ స్థానంలో గతంలో ఉన్నట్టు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చింది. ఇందిరమ్మ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌... ఆ మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రచారంలో పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5లక్షల నగదు, అలాగే స్థలం లేని వారికి స్థలంతో పాటు, ఇల్లు కట్టుకునేందుకు యూనిట్‌కు రూ.5లక్ష ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రాని వాళ్లు, గృహలక్ష్మిలో అర్హత సాధించిన వారు, పూరింట్లో, అద్దె గదుల్లో ఉండే వారు ప్రజాపాలన సభల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైతే రూ.5లక్షలు వస్తాయని ఆశతో ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం అయినా తమకు ఇల్లు కట్టిస్తుందనే ఆశతో పేదలున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:53 PM