Share News

భారీ వర్షం

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:50 PM

రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి.

భారీ వర్షం
షాద్‌నగర్‌ మొయిన్‌ రోడ్డులో ప్రవహిస్తున్న వర్షపు నీరు

పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

రహదారులు జలమయం

ఆమనగల్లు/కేశంపేట/షాద్‌నగర్‌ అర్బన్‌/చేవెళ్ల, జూన్‌ 6: రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. ఆమనగల్లులో గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, గాలులుతో కూడిన వర్షానికి చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి. గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కేశంపేట మండలంలో పిడుగులు పడడంతో తూర్పు చౌలపల్లిలో వడ్ల శ్రీనివాసుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. మండలంలోని పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, వేములనర్వ, పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లి, సంగెం గ్రామాలతో పాటు కేశంపేట. కొత్తపేట గ్రామాలలో వర్షం కురిసింది. షాద్‌నగర్‌ పట్టణంలో ఉరుములు, మొరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కల్గింది. ఈదురు గాలులకు ఈశ్వర్‌కాలనీలోని ఎల్‌టీ విద్యుత్‌ వైర్లు అల్లుకుపోవడంతో మంటలు వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిచింది. అయితే, వర్షానికి ఎలాంటి నష్టమూ జరగలేదని తహసీల్దార్‌ పార్థసారథి తెలిపారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌, కీసరలో వర్షం కురిసింది. మేడ్చల్‌లో విద్యుత్‌ సరఫరాకు కొంతసేపు అంతరాయం కలిగింది.

పలుచోట్ల మోస్తరు వర్షం

ఘట్‌ కేసర్‌/కీసర/మేడ్చల్‌ టౌన్‌: ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై సాయంత్రం 5:30గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బుధవారం కురిసిన వర్షంతో ఐతులు హర్షం వ్యక్తం చేస్తుండగా గురువారం మరోసారి వాన రావడంతో వర్షాకాలం వచ్చేసిందని, ఎండల బాధ తప్పిందని జనం ఉపిరి పీల్చుకున్నారు. కీసరలో వర్షం కురిసింది. కాగా రోహిణి కార్తె మొదట్లో దంచికొట్టిన ఎండలతో జనం సతమతమయ్యారు. మృగశిర కార్తె రాకముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనుల్లో బీజీ అవుతున్నారు. మేడ్చల్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాచింది. వర్షంతో వాతావరణం మరింత చల్లబడింది. కాగా కొన్ని కాలనీల్లో గంట పాటు కరెంట్‌ కట్‌ అయింది.

Updated Date - Jun 06 , 2024 | 11:50 PM