Share News

హమాలీ.. బిహారీ!

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:53 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు కాంటాలు వేసినా ఇంకా రాశులు అధికస్థాయిలోనే ఉంటున్నాయి. ఈ తరుణంలో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసేందుకు బిహార్‌ కూలీలే కీలకమయ్యారు.

హమాలీ.. బిహారీ!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారే అధికం

కాంటాలు వేసేందుకు ముందుకు రాని స్థానికులు

వచ్చినా అధిక కూలి డిమాండ్‌

ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్న బిహారీలు

వారికి కూలి కూడా తక్కువే

వారివైపే కేంద్రాల నిర్వాహకుల మొగ్గు

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు కాంటాలు వేసినా ఇంకా రాశులు అధికస్థాయిలోనే ఉంటున్నాయి. ఈ తరుణంలో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసేందుకు బిహార్‌ కూలీలే కీలకమయ్యారు. స్థానికులు కాంటాలు వేసేందుకు ముందుకు రాకపోవడం, కొన్నిచోట్ల వచ్చినా అధిక కూలీ డిమాండ్‌ చేస్తుండడంతో కేంద్రాల నిర్వాహకులు బిహారీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎక్కువమంది వారే పనిచేస్తున్నారు. స్థానిక హమాలీల కంటే బిహారీలు ఎక్కువ సమయం పనిచేస్తుండడంతో వారివైపే కేంద్రాల నిర్వాహకులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలన్నీ బిహారీ హమాలీలతో నిండిపోయాయి.

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నవంబరు 28: ఉమ్మడి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా మారి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. స్థానిక హమాలీల కంటే ధర తక్కువగా తీసుకోవడంతో పాటు పనులను వేగంగా చేస్తుండడంతో కేంద్రాల నిర్వాహకులు వారివైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌ వడ్లను బస్తాల్లో నింపి, తూకం వేసి లోడ్‌ చేసినందుకు స్థానిక హమాలీలు సుమారు రూ.60 తీసుకుంటున్నారు. దీనికి తోడు స్థానిక హమాలీలకువ్యవసాయం కూడా ఉండడంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో రైతులు తమ ధాన్యం కాంటాలు వేయడంలో ఆలస్యం అవుతుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై వాదనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ హమాలీలు తక్కువ సమయంలో ఎక్కువ ధాన్యాన్ని కాంటాలు వేస్తుండడంతో నిర్వాహకులు వారినే ఎక్కువగా పనిలో పెట్టుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో పత్తి పంట కూడా చేతికి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. వారితోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. స్థానిక హమాలీలు గిట్టుబాటు కూలి దక్కడం లేదని చాలావరకు కేంద్రాలకు రావడం లేదు. మూడేళ్ల నుంచి బిహార్‌ రాష్ర్టానికి చెందిన కూలీలను ముందస్తుగా కొంత అడ్వాన్స్‌ ఇచ్చి తీసుకొస్తున్నారు.

పనుల వేగిరం..

బిహార్‌కు చెందిన కూలీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీహార్‌ హమాలీలు పనిచేస్తుంటే, స్థానికులు మాత్రం 9గంటలకు వచ్చి సాయంత్రం 6గంటలకు వెళ్లిపోతున్నారు. కేంద్రాల్లో రైతు ధాన్యం పోసిన తర్వాత దాన్ని ఆరబెట్టడం, మిషన్‌ ద్వారా శుభ్రం చేయడం, కాంటా వేయడం, బస్తాలను లారీల్లోకి ఎత్తడం తదితర పనులన్నీ బిహార్‌ కూలీలతోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక హమాలీల కంటే బిహార్‌ నుంచి వచ్చిన కూలీల ద్వారానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రైతులతో పాటు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వివిధ రకాల పనుల నిర్వహణకు బిహార్‌ కూలీలు జిల్లాకు వస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కేంద్రాల్లో కొనుగోళ్ల పనులన్నీ పూర్తయిన తర్వాతే వీరంతా తమ స్వస్థలానికి వెళ్లిపోతారు. దాదాపు రెండు మాసాలకు పైగా కేంద్రాల్లో పనిచేస్తారు.

కూలి తక్కువే

బిహారీ కూలీలు ధాన్యం క్వింటాల్‌కు రూ.40 కూలి తీసుకుంటున్నారు. స్థానిక హమాలీల కంటే రూ.20 తక్కువ గానే తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఉన్న హమాలీలు రోజుకు ఒక లారీ లోడ్‌ చేస్తే, బిహారీ హమాలీలు రోజుకు రెండు లారీలను నింపి మిల్లులకు పంపిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు తెచ్చిన ధాన్యం త్వరితగతిన కొనుగోలు కేంద్రాల నుంచి తరలిపోతుంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడే పరిస్థితి తప్పింది.

ఐదేళ్ల నుంచి వస్తున్నాం

ఐదేళ్ల నుంచి శామీర్‌పేట వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తున్నాం. ఇక్కడ సీజన్‌ అయ్యేవరకు నెల రోజులు పని లభిస్తుంది. స్థానిక హమాలీలు, రైతులతో కలిసి పనిచేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు.

సర్వన్‌కుమార్‌, బిహార్‌ హమాలీ

గిట్టుబాటు అవుతుంది

క్వింటాల్‌కు రూ.40 చెల్లిస్తున్నారు. దీంతో ఇంతదూరం వచ్చినందుకు మాకు గిట్టుబాటు అవుతుంది. లోడింగ్‌, అన్‌లోడింగ్‌, బస్తాలు కుట్టడం, తూకం వేయడం లాంటి పనులు చేస్తున్నాం.

కైలాస్‌ కుమార్‌, బిహార్‌ హమాలీ

ఇక్కడెక్కువ కూలి

ఇక్కడ నెల, రెండు నెలలు పని ఉంటుంది. బిహార్‌లో కంటే ఇక్కడ కూలి ఎక్కువ లభిస్తోంది. హమాలీ చేసిన డబ్బులు ఒకేసారి చేతికి వస్తాయి. ఇక్కడి వారు మాకు ఫోన్‌ చేసి పిలిస్తే ఇక్కడకు వచ్చాం

- బ్రాజేష్‌, హమాలీ, బిహార్‌

పనులు త్వరగా పూర్తి చేస్తారు

బిహార్‌ కూలీలు వేగంగా పనులు చేస్తారు. తూకం కూడా బాగా వేస్తారు. వీళ్లు ఎక్కువ సమయం పనిచేసి తూకం ఆలస్యం కాకుండా చూస్తారు. ఎక్కువ పని ఉన్నా కాదనకుండా చేస్తారు.

- అనంతయ్య, రైతు, ధారూరు మండలం

ఉమ్మడి జిల్లాలో..

కొనుగోలు కేంద్రాలు 150

మొత్తం హమాలీలు 1546

స్థానికులు 626

బిహారీలు 920

================

రంగారెడ్డి

కొనుగోలు కేంద్రాలు 38

మొత్తం హమాలీలు 190

స్థానికులు 60

బిహారీలు 130

వికారాబాద్‌

కొనుగోలు కేంద్రాలు 99

మొత్తం హమాలీలు 1,210

స్థానికులు 540

బిహారీలు 670

మేడ్చల్‌

కొనుగోలు కేంద్రాలు 13

మొత్తం హమాలీలు 146

స్థానికులు 26

బిహారీలు 120

======================

Updated Date - Nov 28 , 2024 | 11:55 PM