రోడ్డుపైనే ధాన్యం ఆరబోత
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:48 PM
రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు.
ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
కేశంపేట మండలంలో పలువురు మృత్యువాత
రైతులకు అవగాహన కల్పించాలంటున్న ప్రజలు
కేశంపేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రి సమయంలో కుప్పలు గమ నించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది మండల పరిధిలోని సంతాపూర్ సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రాయి తగలడంతో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతి చెందగా, మిగతా కూలీలు గాయపడ్డారు. కొత్తపేట-మంగళగూడెం మార్గంలో మొక్కజొన్న ఆరబోసిన చోట ట్రాక్టర్ ట్రాలీ పెట్టడంతో రాత్రి సమయంలో బైక్ ఢీకొట్టగా కోళ్లపడకల్ గ్రామానికి చెందిన భరత్‌కుమార్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. అలాగే సంగెం సమీపంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కనబడక బైక్‌ను ధాన్యం మీదికి వెళ్లడంతో పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. కాగా, ప్రస్తుతం మండలంలో మొక్కజొన్న పంట నూర్పిడీలు చేస్తున్నారు. పంటను ఆరబోయడానికి రోడ్లను ఎంచుకుంటున్నారు. మండలంలో ప్రధానంగా సంగెం-వేముల్‌నర్వ, ఇప్పలపల్లి-కొండారెడ్డిపల్లి, బైర్కాన్‌పల్లి-అల్వాల, సంతాపూర్-కొత్తపేట మార్గంలో ధాన్యం కుప్పలు రోడ్లపై ఆరబోస్తున్నారు. రోడ్లపై నూర్పిడీలు చేయకుండా, ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహన దారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
ధాన్యం రోడ్లపై ఆరబోస్తుండడంతో నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. గతేడాది రోడ్డుపై ధాన్యం కుప్పల పక్కన ఉన్న రాయి తగిలి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడగా ఓ మహిళా మృతిచెందింది. రోడ్లపై పంటలను ఆరబెట్టకుండా, నూర్పిడీలు చేపట్టకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి.
- కర్రెడ్ల నరేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, సంతాపూర్
-------------------------
రాత్రివేళ ప్రయాణమంటేనే భయమేస్తోంది
బైక్‌పై నిత్యం పనులు ముగించుకొని రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్తుంటా. ఈ సీజన్‌లో రాత్రివేళ బైక్ నడపాలంటేనే భయమేస్తోంది. రోడ్లపై ధాన్యం కుప్పల మీద నల్లటి కవర్ కప్పడంతో రాత్రి సమయంతో బీటీ రోడ్డు మాదిరిగానే కనిపిస్తోంది. వాహనదారులు గమనించక పోతే ప్రమాదానికి గురికావాల్సిందే. రోడ్లపై కల్లాలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలి.
- కుమ్మరి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్, సంగెం