Share News

అన్నదాతకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:09 AM

అన్నదాతను నట్టేటముంచే కల్తీ విత్తనాల అంతు చూడడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌ ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో మంగళవారం విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులపై డీలర్లు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, వేదికపై డీసీపీ నారాయణరెడ్డి

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

విత్తనాలు, ఎరువుల డీలర్లు, రైతులకు అవగాహన సదస్సు

షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 11: అన్నదాతను నట్టేటముంచే కల్తీ విత్తనాల అంతు చూడడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌ ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో మంగళవారం విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులపై డీలర్లు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కల్తీ, నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలను సాగుచేస్తే దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతారని గుర్తుచేశారు. ఆ నష్టం రైతుకే కాదు.. పరోక్షంగా వ్యాపారులపై, సమాజంపై కూడా పడుతుందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల నివారణ కోసం తీసుకునే చర్యల్లో రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నాణ్యమైన, మేలురకమైన విత్తనాలను మాత్రమే వ్యాపారులు విక్రయించాలని సూచించారు. నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షాద్‌నగర్‌ ఏడీఏ రాజరత్నం మాట్లాడుతూ వానకాలం పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని కోరారు. 470 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు విక్రయించామని, మరో 80 క్వింటాళ్లు రాబోతున్నాయని తెలిపారు. షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి, సీఐలు కె.ప్రతాపలింగం, సత్యనారాయణ, ప్రసాద్‌, నర్సింహారావు, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వై.యాదయ్యయాదవ్‌, వ్యవసాయాధికారులు నిశాంత్‌కుమార్‌, గోపాల్‌, శిరీష, కృష్ణమోహన్‌ తదితరులున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:09 AM