Share News

మరోసారి ఎంపీగా అవకాశం కల్పించండి: రంజిత్‌రెడ్డి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:33 AM

వేలకోట్లు ఉన్నా ప్రజాసేవ చేయలేని వ్యక్తి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విమర్శించారు.

మరోసారి ఎంపీగా అవకాశం కల్పించండి: రంజిత్‌రెడ్డి
తాండూరులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలో భాగంగా బైకులు నడిపిస్తున్న రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌ 26: వేలకోట్లు ఉన్నా ప్రజాసేవ చేయలేని వ్యక్తి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని మల్కాపూర్‌, కరన్‌కోట్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటువేసి అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ గెలిస్తే ఉచిత పథకాలు ఇవ్వదన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్లకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వేల కోట్లు ఉన్నా ప్రజలకు సేవ చేయలేదన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోలేదన్నారు. అంతెందుకు తన అపోలో ఆస్పత్రిలో ఒక్కరూపాయి బిల్లు కూడా తగ్గించలేదని దుయ్యబట్టారు. మరోసారి చేవెళ్ల ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను నమ్మి గెలిపించిన తాండూరు ప్రజలకు రుణపడి ఉన్నానని, వారికి సేవ చేసుకుంటానని అన్నారు. ఎన్నికల తర్వాత తాండూరు అభివృద్ధిపై దృష్టి సారిస్తానని అన్నారు. జూన్‌ 4 తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రేషన్‌ కార్డు, కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప, నాయకులు ధారాసింగ్‌, ఉత్తంచంద్‌ పాల్గొన్నారు.

తాండూరులో భారీ బైక్‌ ర్యాలీ

తాండూరు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరులోని విలియమూన్‌ చౌరస్తా నుంచి సాయిపూర్‌ వరకు చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయిపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అనేవి మన పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. మతతత్వ పార్టీలు ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రజలు వారికి ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ధారాసింగ్‌, మాజీ ఎంపీపీ కర్ణం పురుషోత్తంరావు పాల్గొన్నారు.

అమూల్యమైన ఓటు కాంగ్రెస్‌కే వేయాలి

వికారాబాద్‌: ప్రజలు తమ అమూల్యమైన ఓటు కాంగ్రె్‌సకే వేయాలని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి గడ్డం సీతారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో శుక్రవారం ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వ సుజాత, సుధాకర్‌రెడ్డి, విశ్వనాథం సత్యనారాయణ, మురళి, మాలే గాయత్రి లక్ష్మణ్‌, మోముల స్వాతి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా పూడూరు మండలం చీలాపూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేడు యాలాల మండలంలో ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలు పర్యటిస్తారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: రంజిత్‌రెడ్డి

శంకర్‌పల్లి: కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్‌ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మహలింగపూరం గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు ఆయన సమక్షంలో శంకర్‌పల్లి పార్టీ కార్యాలయంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఇన్‌చార్జి పామెన భీంభరత్‌, మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, మున్సిపాల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి

చేవెళ్ల: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌లు దేవర వెంకట్‌రెడ్డి, గోనే ప్రతా్‌పరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అల్లావాడ, జాలగూడ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో రంజిత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నట్టు జడ్పీటీసీ జంగారెడ్డి తెలిపారు. అదేవిధంగా సరూర్‌నగర్‌లో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకులు బేరే బాలకిషన్‌, పారుపల్లి దయాకర్‌రెడ్డి, ఆకుల అరవింద్‌కుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు శంకర్‌యాదవ్‌, ఆల్విన్‌ కాలనీలో జరిగిన ప్రచారంలో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటే్‌షగౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు సంజీవరెడ్డి, కృష్ణముదిరాజ్‌తో కలిసి ధరణినగర్‌లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పార్టీ నాయకులు రామకృష్ణగౌడ్‌, సమ్మారెడ్డి, పాండుగౌడ్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌, సంగమేష్‌, అగ్రవాసు, బాలస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:33 AM