దోపిడీ దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:32 AM
దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి నగదు, కార్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్న చెన్నైకి చెందిన వ్యాపారి తిరుమన తురై ఇంట్లో ఈనెల 11న చోరీకి ప్రయత్నించిన కేసును ఆదిభట్ల పోలీసులు ఛేదించారు.

పోలీసుల అదుపులో నిందితులు
రూ.80 వేలు, 3 కార్లు, స్కూటీ స్వాధీనం
పోలీసుల అదుపులో 15 మంది నిందితులు
ఒకే ఇంట్లో రెండుసార్లు దోపిడీకి విఫలయత్నం
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఆదిభట్ల, జూన్ 16 : దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి నగదు, కార్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్న చెన్నైకి చెందిన వ్యాపారి తిరుమన తురై ఇంట్లో ఈనెల 11న చోరీకి ప్రయత్నించిన కేసును ఆదిభట్ల పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధమున్న 15మంది నిందితులను అరెస్టు చేశారు. మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సమక్షంలో ఆదిభట్ల ఎస్‌ఎచ్‌వో రాఘవేందర్‌రెడ్డి నిందితులను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీసీపీ మాట్లాడుతూ ఈనెల 11న తుర్కయంజాల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే చాక్లెట్ తయారి సంస్థ వ్యాపారి తిరుమన తురై ఇంటివద్ద దుండగులు వాచ్‌మ్యాన్‌ను కొట్టి.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ప్రధాన ద్వారం పగులగొట్టి ఇంట్లోకి ప్రయత్నించారు. గమనించిన వ్యాపారి కుమార్తె డయల్ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు సైరన్ శబ్ధం విని దండగులు పారిపోయారు. అయితే, వారు వెళుతూ వెళుతూ వాచ్‌మ్యాన్ సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. తిరుమన తురై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ ఆధ్వర్యంలో ఆదిభట్ల ఎస్‌ఎచ్‌వో రాఘవేందర్‌రెడ్డి స్పెషల్ టీమ్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసేక్రమంలో వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఓ బేకరీలో సమావేశం అయిన నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
రూ.950 కోట్ల బ్లాక్‌మనీ ఉందని స్కెచ్!
హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి బోగిని జంగయ్యకు డ్రైవర్ శేఖర్‌రెడ్డి, ఇసుక వ్యాపారం చేసే ఎండీ మైమూద్ అనే స్నేహితులున్నారు. వారంతా వ్యాపారాల్లో నష్టాలపాలై తుర్కయాంజాల్‌లోని టీషాప్ దగ్గర తరచూ కలుస్తూ ఉండేవారు. ఈక్రమంలో ఏదైనా చట్ట వ్యతిరేక పనులు చేసి డబ్బులు సంపాదించాలని నిశ్చయించుకున్నారు. ఈక్రమంలో తిరుమన తురై ఇంట్లో రూ.950 కోట్లు నల్లధనం ఉన్నట్లు.. వ్యాపారి ఇంట్లో గతంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేసిన వ్యక్తి ద్వారా రియల్‌ఎస్టేట్ వ్యాపారి బోగిని జంగయ్యకు సమాచారం వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన ఓ పూజారిని తీసుకువచ్చి పూజలు చేయించి దొంగతనం చేయాలనుకున్నారు. కానీ, వీళ్లు ఇచ్చే డబ్బు సరిపోకనో.. మరేదో కారణంచేతనో పూజారి మళ్లీ వారి వద్దకు రాలేదు. దాంతో విజయవాడకు చెందిన రజాక్ అనే క్రిమినల్‌ను సంప్రదించారు. వ్యాపారి తిరుమన తురై వద్ద పనిచేసిన మేనేజర్ నెంబర్ తీసుకొని తనను సంప్రదించి నల్లధనం ఉన్న విషయం నిజమేనని నిర్ధారించుకున్నారు.
గతంలో మోసపోయిన వ్యక్తిని మళ్లీ రంగంలోకి దింపి..
రజాక్ అనే క్రిమినల్ ద్వారా గతంలో మోసపోయిన సతీష్ అనే వ్యక్తికి ఫోన్‌చేసి గతంలో పోగొట్టుకున్న సొమ్ము తిరిగి సంపాదించుకునేందుకు అ దకాశం వచ్చిందని, వ్యాపారి ఇంటి లొకేషన్ పంపించి రూ.950 కోట్ల నల్ల ధనం ఉందని, దోపిడీ చేయడానికి మనుషులు కావాలని, నీకు కూడా వాటా ఉంటుందని చెప్పాడు. దాంతో సతీష్ జాఖీ లఖానీ అనే వ్యక్తి ద్వారా మైమూద్, సతీ్‌షలకు ఉమ్మడి మిత్రుడైన పెద్ది శ్రీనివాస్ కూడా దోపిడీ చేసేందుకు ఒప్పుకున్నాడు. జాఖీ లఖానీ, సవూద్, ఆదిల్, ముదాసీర్, ఖాదర్, అక్బర్, షమీమ్, జాఫర్, ఇస్మాయిల్‌లతో టీమ్ ఏ ర్పాటు చేసి దోపిడీకి రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ఐరన్ కట్టర్, స్పానర్స్, రెండు ఫైర్‌స్పేర్‌లు, డోర్ తాళం పగల గొట్టడానికి ఐరన్ రాడ్‌లు అవసరమైతే ఎదురించిన వారిని హత్య చేసేందుకు కత్తులు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేశారు. ఈనెల 4న రాత్రి 1.30 గంటల సమయంలో దోపిడీకి వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించి చూడగా యజమాని కుటుంబం వెలకువతో ఉండగా.. బయట వాచ్‌మ్యాన్ కూడా ఉండటంతో వెనుతిరిగి వచ్చేశారు. ఈనెల 11న తెల్లవారుజామున మరోసారి పథకం వేశారు. ఇద్దరు వాచ్‌మెన్‌లను కొట్టి బెదిరించి చేతులు కట్టేసి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 8 మంది గోడదూకి ఇంట్లోకి ప్రవేశించారు. నిచ్చెనల సహాయంతో రెండో అంతస్తుకు వెళ్లగా శబ్ధంతో ఇంట్లోవారు లేచి సీసీ టీవీలో చూసి ఇంట్లోకి దొంగలు ప్రవేశించినట్లు గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మూడోసారి పోలీసులకు చిక్కి..
తిరుమన తురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని నమ్మి.. రెండు సార్లు దోపిడీకి యత్నించి మూడోసారి ప్లాన్ చేసేందుకు వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఓ బేకరీలో సమావేశమైన 15 మంది నిందితులను ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని పోలీస్ టీం చాకచక్యంగా పట్టుకొని వారి నుంచి రూ.80వేల నగదుతోపాటు 3 కార్లు, స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, 2 ఐరన్ కట్టర్లు, 2 ఫైర్‌స్ర్పేలు, ఇనుప రాడ్లు, 6 ఫేక్‌మనీ బ్లాక్ పేపర్స్ బండిల్స్, ఫేక్ మనీ తయారీ పౌడర్, 20 లీటర్ల రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఆదివారం రి మాండ్‌కు తరలించారు. పెద్దఎత్తున దోపిడీకి యత్నించిన దొంగలను కేవలం వారంలోపే అరెస్టు చేసిన ఎస్‌ఎచ్‌వో రాఘవేందర్ రెడ్డి, ఎస్సై కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు, కానిస్టేబుల్ కృష్ణ, రవిందర్, ఉపేందర్, శివచంద్ర, సంతో్‌షలతో కూడిన ప్రత్యేక టీమ్‌ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్లాన్
అంతా అనుకున్నట్లు జరిగి తిరుమన తురై ఇంట్లో దోపిడీ చేస్తే.. ప్రజలు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సైతం దుండగులు ప్లాన్ వేశారు. దోపిడీ అనంతరం దొంగతనం చేసిన డబ్బులు ఉంచిన స్థలంలో ఫేక్ మనీ తయారుచేసే బ్లాక్ పేపర్స్ బండీల్స్, దానికి అవసరమయ్యే పౌడరు, లిక్విడ్‌లు ఉంచి తిరుమన తురై ఇంట్లో ఫేక్‌మనీ తయారుచేస్తున్నట్లు నమ్మించి పోలీసుల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించినట్లు డీసీపీ చెప్పారు.