Share News

నిప్పుల కొలిమి..!

ABN , Publish Date - May 03 , 2024 | 12:20 AM

భానుడి ఉగ్రరూపంలో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

నిప్పుల కొలిమి..!
ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన నార్సింగ్‌ నుంచి అప్పా జంక్షన్‌కు వెళ్లే ఔటర్‌ రింగ్‌ రోడ్డు

భానుడి ఉగ్రరూపంతో ఉక్కిరి బిక్కిరి

ఉక్కపోత, వడగాడ్పులతో విలవిల

నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు

కీసర, పుట్టపహాడ్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి అర్బన్‌, మే 2 : భానుడి ఉగ్రరూపంలో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఓ వైపు ఎండవేడి, మరో వైపు ఒక్కపోత, ఇంకోవైపు వడగాల్పులు.. జనాలు విలవిల్లాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటాయి. బయటకు రావడానికే జనం జంకుతున్నారు. నాలుగు రోజులుగా వడగాడ్పులకు నియోజకవర్గ, మండల కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉదయం 9 గంటల తర్వాత బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసర పనులున్న వారు మినహా మిగతా ఎవరూ బయటకు రావడం లేదు. ఎండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని. రానున్న రెండు రోజుల పాటు ఎండలు గరిష్టంగా ఉండవచ్చని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పులతో నీరసం, అలసట, తీవ్రమైన దాహం, వడదెబ్బ వంటి వాటికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిరి మండలం కీసరలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - May 03 , 2024 | 12:21 AM