‘లక్ష్మీదేవిపల్లి’ నిర్మాణానికి నిధులు తెస్తా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:42 AM
షాద్‌నగర్ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించేందుకు నిర్మించతలపెట్టిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

హిందువులపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు బాధించాయి
పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ
కొత్తూర్, జూలై 4 : షాద్‌నగర్ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించేందుకు నిర్మించతలపెట్టిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆమె అన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న డీకే అరుణకు పార్లమెంట్ నియోజకవర్గ ముఖద్వారమైన రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ వద్ద బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎర్రవెళ్లి నాగరాజుచారి, మండల శాఖ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. డీకే అరుణ తిమ్మాపూర్‌కు చేరుకోగానే నాయకులు స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం పక్కనే ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తూర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పాటు అందిస్తానని స్పష్టం చేశారు. నిధులు తీసుకొచ్చి పార్లమెంట్ పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేస్తానన్నారు. రాహుల్‌గాంధీ ఇటీవల పార్లమెంట్‌లో హిందువులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించిందని డీకే అరుణ గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. ప్రజలు తనపై నమ్మకం పెట్టుకొని ఎంపీగా గెలింపించారని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కారిస్తానని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. శ్రీవర్ధన్‌రెడ్డి, డీకే అరుణ, దేపల్లి అశోక్‌గౌడ్, కడెంపల్లి సదానంద్‌గౌడ్, అమడపురం నర్సింహగౌడ్, కమ్మరి భూపాలచారి, భాస్కర్, లక్ష్మణ్, రణధీర్‌గౌడ్, బావండ్ల మాణిక్యం, చెట్ల వెంకటేష్, మల్‌చలం మురళి, వంశీ, వెంకటే్‌షయాదవ్, నర్సింహయాదవ్, ప్రవీణ్, శ్రీశైలంగౌడ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.