నిధులున్నా నిష్ప్రయోజనం
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:52 PM
గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు. యాచారం మండలంలోని కొత్తపల్లి- మాల్, కొత్తపల్లి-నాగిల్ల, నజ్దిక్‌సింగారం- అయ్యవారిగూడ మధ్య ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరు
అస్తవ్యస్తంగా దారులు
అవస్థ పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
యాచారం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు. యాచారం మండలంలోని కొత్తపల్లి- మాల్, కొత్తపల్లి-నాగిల్ల, నజ్దిక్‌సింగారం- అయ్యవారిగూడ మధ్య ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు అప్పటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించారు. కొత్తపల్లి నుంచి మాల్ రోడ్డు మరమ్మతుకు రూ.3కోట్ల 50లక్షలు, కొత్తపల్లి నుంచి నాగిల్ల రహదారి పనులకు రూ.3కోట్లు, నజ్దిక్‌సింగారం నుంచి అయ్యవారిగూడ గ్రామాల మధ్య ఉన్న రోడ్డు మరమ్మతుకు రూ.28లక్షల నిధులు కేటాయించారు. పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు పూర్తికాలేదు. కొత్తపల్లి నుంచి మాల్ గ్రామాల మద్యన రెండు చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. గోతులు తీసి కంకర వేసి వదిలేశారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కొత్తపల్లి గ్రామస్తులు తక్కళ్లపల్లి గేటు మీదుగా మాల్ చేరుకుంటున్నారు. ఈ రహదారిపై రెండుచోట్ల సీసీ రోడ్డు కూడా వేయాల్సి ఉంది. కొత్తపల్లి నుంచి నాగిల్ల రహదారి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అయ్యవారిగూడ నుంచి నజ్దిక్‌సింగారం గ్రామాల మధ్య కిలోమీటర్‌న్నర మేర మట్టి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. నల్లవెల్లి నుంచి మంతన్‌గౌరెల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఇరుగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల మళ్లింపు?
గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రోడ్లకు మరమ్మతులు చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా పనులు చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేకపోవడంతో పనులు చేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కోట్లాది రూపాయల నిధులు ఇతర శాఖలకు మళ్లించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ శశాంక కల్పించుకొని రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.
రోడ్డు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
కొత్తపల్లి మాల్ గ్రామాల మధ్య చాలాకాలంగా రోడ్డు మరమ్మతు పనులు ఆగిపోయాయి. ఏడాది కావస్తున్నా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియడం లేదు. రోడ్డు బాగలేకపోవడంతో 9కిలోమీటర్లు చుట్టూ తిరిగి మాల్‌కు చేరుకుంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆగిపోయిన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి
- విప్లవ్‌కుమార్, కొత్తపల్లి
రోడ్డు బాగు చేయండి
అయ్యవారిగూడ-నజ్దిక్‌సింగారం గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా పాడైంది. అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయించాలి. లేదంటే రెండు గ్రామాల ప్రజలు కలిసి ఆందోళన చేస్తాం. కలెక్టర్ కల్పించుకొని రోడ్డును బాగు చేయించి ఆదుకోవాలి.
కడారి శ్రీశైలం యాదవ్, నజ్దిక్‌సింగారం