Share News

అక్రమ నిర్మాణాలకు ఆజ్యం!

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:37 PM

గ్రామపంచాయతీ పాలకవర్గం పదవీకాలం కొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారు.

అక్రమ నిర్మాణాలకు ఆజ్యం!
కీసరలో నిర్మిస్తున్న అక్రమ షెడ్లు

  • అందినకాడికి దోచుకుంటున్న ప్రజాప్రతినిధులు

  • వాటాలు పంచుకుంటున్న అధికారులు

  • ప్రభుత్వాదాయానికి భారీగా గండి

కీసర, జనవరి 25: గ్రామపంచాయతీ పాలకవర్గం పదవీకాలం కొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమ నిర్మాణాల్లో వాటాలు పంచుకుంటున్నారు. కీసర మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలు, షెడ్లు జోరుగా సాగుతున్నాయి. బాధ్యత వహించాల్సిన ప్రజాప్రతినిఽధులే దగ్గరుండి అక్రమ నిర్మాణాలకు, షెడ్లకు ఆజ్యం పోస్తున్నారు. కీసరలో జరిగే అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటు జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు గానీ పట్టించుకున్నపాపాన పోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం, నోటీసులు జారీ చేస్తాం అనే సమాధానాలు అధికారుల వైపు నుంచి వినిపిస్తున్నాయే తప్పా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారుల పనితీరు దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్న అధికారులు ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాదారులు ఇచ్చే సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు స్థానిక అధికారులపై చర్యలు తీసుకోకపోతే కీసరలో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరిగి ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:37 PM