Share News

‘స్థానికం’పై ఫోకస్‌!

ABN , Publish Date - May 20 , 2024 | 12:09 AM

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. చట్ట సభల ఎలక్షన్లు అయిపోవడంతో ఇక స్థానిక పాలన అందించే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు.

‘స్థానికం’పై ఫోకస్‌!

పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో కొనసాగుతున్న చర్చ

ఎన్నికల బరిలో దిగేందుకు యువత, నాయకుల ఆసక్తి

ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడమే తరువాయి

సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానంపై దృష్టి

రిజర్వేషన్ల ఖరారుపై ఆశావహుల ఎదురుచూపు

పాత రిజర్వేషన్లే కొనసాగితేవెంటనే రంగంలోకి!

గత ఐదారు నెలలుగా కొనసాగిన చట్ట సభల ఎన్నికల సందడి ముగియడంతో ఇక స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాసేవపై ఆసక్తి ఉన్న యువత దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. కొన్ని నెలల క్రితమే పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తవడంతో నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తవడంతో పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. మండల/జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం కూడా త్వరలోనే ముగియ నుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకులు, యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చౌదరిగూడ, మే 19 : శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. చట్ట సభల ఎలక్షన్లు అయిపోవడంతో ఇక స్థానిక పాలన అందించే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్లపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లనే రానున్న ఎన్నికల్లోనూ కొనసాగిస్తారా? లేక మరోసారి రిజర్వేషన్లను కొత్తగా రూపొందిస్తారా? అనే తేలాల్సి ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లను పెంచి బీసీలకు 50శాతం ఇవ్వాలని ఆయా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం 15 నుంచి 20 రోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు రణ రంగంలోకి దూకనున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకోనుంది. ఒకవైపు ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు, యువకులు చొరవ చూపుతున్నారు. గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ/మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సహం చూపుతోంది. ముఖ్యంగా మొదట జరిగే సర్పంచ్‌ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు. కాగా చౌదరిగూడ మండలంలో 24 పంచాయతీలు 29 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. మొత్తం 25,037 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 12,796, మహిళలు 12,237, థర్డ్‌జెండర్‌ నలుగురు ఉన్నారు.

రాజకీయాల వైపు యువత చూపు

ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తుంది. రోజూ ఊరిలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో నిల్చుంటే ప్రజల మన్ననలు పొందేలా పనితీరును మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అధిష్ఠించిన వారిలో చాలా మంది సర్పంచ్‌ పదవి నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంతో స్థానిక ఎన్నికలను చాలా మంది ఓ అవకాశంగా తీసుకుంటారు. గ్రామంలో, మండలంలో పట్టు పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీలో అయినా నేతగా ఎదిగే ఆస్కారం ఉండడంతో మొదట స్థానిక పదవుల్లో నెగ్గేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తా రు. ముఖ్యంగా సర్పంచ్‌ పదవిపై దృష్టి పెడతారు. రాజకీయ పార్టీ మద్దతుతో గెలవాలని చూస్తారు. ఒక వేళ ఒకేపార్టీలో ఎక్కువ మంది అభ్యర్థులు నిల్చుంటే తమ సొంత ప్రాబల్యంతో పాటు తమకు అనుకూలంగా ఉండే వారి మద్దతు తీసుకొని ఎన్నికల్లో గెల్చి ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపించుకుంటారు. ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు చాలా మంది రాజకీయ ప్రస్థానానికి తొలి మెట్టుగా భావి ంచొచ్చు. రానున్న జీపీ, పరిషత్‌ల ఎన్నికలను తమ రాజకీయానికి నాందిగా చేసుకోవాలని యువత భావిస్తోంది. రాజకీయ పదవులతో ప్రజాసేవ చేయడంతో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది.

రిజర్వేషన్ల ఖరారు కోసం ..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతీ రెండు టెర్ములకు ఒకసారి రిజర్వేషన్లు మార్చాలని అసెంబ్లీలో చట్టం చేసింది. దీని ప్రకారం ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పాటించిన రిజర్వేషన్లనే రానున్న ఎన్నికల్లోనూ పాటించాలి. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో చట్టాన్ని తెస్తుందా? లేక పాత రిజర్వేషన్లనే అమలు చేస్తుందా? అనే తేలాల్సి ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి రిజర్వేషన్ల గందరగోళం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు ఎన్నికలకు ఒకసారి చొప్పున రిజర్వేషన్లు మార్చాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2019లో నూతన పంచాయతీ చట్టం చేసింది. మరి కొత్త ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందనే దానిపై రిజర్వేషన్ల కేటాయింపు ఆధారపడి ఉంది. రాజకీయ కోణంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల పదవుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్ల వర్తింపు, కోటాలో ఎలాంటి తేడా లేకున్నా ఏ పంచాయతీ, ఏ వార్డు ఎవరికి కేటాయిస్తానే అంశంపైనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాత విధానాన్ని కొనసాగిస్తే ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా పోయినసారి ఎవరికి సీటు కేటాయించారో ఆయా సామాజిక వర్గాల వారు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల్లో అన్ని వర్గాల మహిళలకు 50శాతం సీట్లు కేటాయిస్తారు.

Updated Date - May 20 , 2024 | 12:09 AM