Share News

శ్రీగంధం చెట్ల నరికివేత

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:57 PM

గడ్డమల్లాయగూడలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. ఆరుగురు రైతుల వ్యవసాయ బావుల వద్ద 15 శ్రీ గంధం చెట్లను నరికి సుమారు రూ. 80లక్షల విలువైన దుంగలను దొంగిలించారు.

శ్రీగంధం చెట్ల నరికివేత

నెల వ్యవధిలో రెండుసార్లు ఘటన

ఐదు గొర్రెలనూ అపహరించిన దుండగులు

యాచారం, జనవరి 12 : గడ్డమల్లాయగూడలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. ఆరుగురు రైతుల వ్యవసాయ బావుల వద్ద 15 శ్రీ గంధం చెట్లను నరికి సుమారు రూ. 80లక్షల విలువైన దుంగలను దొంగిలించారు. అలాగే అచ్చన వెంకటయ్య అనే గొర్లకాపరికి చెందిన ఐదు గొర్రెలను అపహరించారు. ఇలాంటి ఘటన జరిగి నెల గడవక ముందే దుండగులు మరోసారి దొంగతనం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. బోజిరెడ్డి పొలంలో 15 శ్రీగంధం చెట్లుండగా రెండు చెట్లను, చంద్రయ్య పొలంలో పది శ్రీ గంధం చెట్లుండగా 4, రాజశేఖర్‌రెడ్డి పొలంలో 10 శ్రీగంధం చెట్లుండగా 3, వెంకటరెడ్డి పొలంలో 8 శ్రీ గంధం చెట్లుండగా ఒక చెట్టును, రాకే్‌షరెడ్డి పొలంలో 8 శ్రీగంధం చెట్లుండగా 2, యాదగిరి పొలంలో 10 శ్రీ గంధం చెట్లుండగా 3చెట్లను దుండగులు నరికివేశారు. బైక్‌లపై వచ్చి తమ పని చేసుకొని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు మద్యం సేవించి విందు చేసుకున్నట్లు, సంఘటనా స్థలంలోని మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. కాగా, గంధం చెట్లను నరికి తీసుకెళ్లే క్రమంలో దుండగులు అచ్చన వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన గొర్లమందలో రెండు గొర్రె పొట్టేళ్లతో పాటు మూడు గొర్లను అపహరించారు. వాటివిలువ రూ.45 వేలు ఉంటుందని బాధితుడు వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత డిసెంబరు 24న రాత్రి నలుగురు రైతుల పంట పొలాల్లోని శ్రీగంధం చెట్లను నరికి అపహరించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదయ్య, ఎస్‌ఐ వెంకటనారాయణ చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 11:57 PM