Share News

రైతు నెత్తిన ధరల పిడుగు

ABN , Publish Date - May 21 , 2024 | 11:58 PM

ప్రతీ ఏటా ఎరువుల విత్తనాల ధరలు పెరుగుతుండడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎరువుల, విత్తనాల ధరలను ఏటేటా పెరుగుతున్నందున పంట పెట్టుబడులకు అప్పులు చేసి దివాళా తీస్తున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతు నెత్తిన ధరల పిడుగు

ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదలతో భారం

ప్రతీ ఏటా పెరుగుతున్న రేట్లు

పండించిన పంటకు మాత్రం దక్కని మద్దతు

ధాన్యం తమకే అమ్మాలన్న నిబంధనతో అప్పు ఇస్తున్న ఎరువుల వ్యాపారులు

తక్కువ ధరకే పంట కొనుగోలు

రెండు విధాలుగా నష్టపోతున్న రైతన్నలు

ప్రతీ ఏడాది నష్టాల బాటలోనే రైతులు

ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది పాలకులు మారినా రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. ప్రతీ ఏడాది వ్యాపారుల చేతిలో మోసపోయి నష్టాల బారిన పడుతూనే ఉన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రైతు పండించిన పంటకు మాత్రం ఏనాడూ గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు చెల్లించలేక రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

యాచారం, మే 21: ప్రతీ ఏటా ఎరువుల విత్తనాల ధరలు పెరుగుతుండడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎరువుల, విత్తనాల ధరలను ఏటేటా పెరుగుతున్నందున పంట పెట్టుబడులకు అప్పులు చేసి దివాళా తీస్తున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగినా తాము పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పంటల సాగుకోసం అనేకమంది రైతులు తమ వెండి, బంగారు నగలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మరీ సాగు చేస్తున్నారు. ఏటా ఎరువులు, విత్తనాల ధరలు పెరిగినా పంట పండించడం కోసం అప్పులు చేయక తప్పడం లేదు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో బ్లాక్‌ మార్కెటీర్లు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకమ్మడంతో పాటు పంట చేతికందగానే తమకే ధాన్యం విక్రయించాలని నిబంధన విదించి ఎరువులు, విత్తనాలు ఉద్దెరకిస్తున్నారు, ఉద్దెరగా ఎ రువులు విత్తనాలు తీసుకున్న రైతుల నుంచి ధాన్యం కూడా తక్కువ ధరకే కొంటున్నారు. దీంతో అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు కొనడంతో పాటు పండించిన పంటను తక్కువ ధరకు ఆ వ్యాపారులకే ఇవ్వాల్సి రావడంతో రెండు విధాలుగా నష్టాల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ పత్తి విత్తనాలు

అంటగడుతున్న దళారులు

కొంతమంది దళారులు పత్తి విత్తనాలను అధిక ధరలకమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి నకిలీ పత్తి విత్తనాలను తెచ్చి రైతులకు అధిక ధరలకమ్మడం కోసం యత్నిస్తున్నారు. ఈ ఏడాది యాచారం, హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీసులతో పాటు వ్యవసాయాధికారులు నకిలీ పత్తి విత్తనాల క్రయ విక్రయాలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, పత్తి విత్తనాలను అధిక ధరకు అమ్మడం కోసం గోప్యంగా పావులు కదుపుతున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. పత్తి విత్తనాలు కొనే ముందు ఐఎ్‌సఐ ముద్ర ఉందా.. లేదా సరిచూసుకోవాలని, ఆ ముద్ర లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌ రైతులను కోరారు.

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతాం : టి.రాజేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌, యాచారం

ఈ సారి రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ సారి జీలుగ విత్తనాలు కూడా తేవడం కోసం ప్రభుత్వానికి ఇండెంట్‌ పంపాం. డీఏపీ, యూరియా, జనుము విత్తనాలు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టినం. రైతులు పంట పెట్టుబడి కోసం ఇతరులపై ఆధారపడకండి. బంగారు, వెండి అభరణాలు తాకట్టుపెట్టి రుణం ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - May 21 , 2024 | 11:58 PM