అభివృద్ధికి ఆమడదూరం!
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:47 PM
మేడ్చల్ నియోజకవర్గానికి రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి హేమాహేమీలు గెలుపొంది, ఉన్నత పదవులు అధిరోహించినా ఇక్కడ పెండింగ్ సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్రం మారినా... పాలకులు మారుతున్నా ఇక్కడి ప్రజల తలరాలతలు మాత్రం మారడం లేదు.

-ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు
-డిగ్రీ కళాశాల ఏర్పాటుకు దశాబ్దకాలంగా పోరాటం
-కళా విహీనంగా శామీర్‌పేట బస్టాండ్
-హామీలకే పరిమితమైన డంప్‌యార్డు తొలగింపు
-‘మేడ్చల్’లో ఎక్కడి సమస్యలు అక్కడే
-ఇక్కడి నుంచి హేమాహేమీలు గెలిచినా మారని పరిస్థితి
మేడ్చల్ ప్రతినిధి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మేడ్చల్ నియోజకవర్గానికి రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి హేమాహేమీలు గెలుపొంది, ఉన్నత పదవులు అధిరోహించినా ఇక్కడ పెండింగ్ సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్రం మారినా... పాలకులు మారుతున్నా ఇక్కడి ప్రజల తలరాలతలు మాత్రం మారడం లేదు.
డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఆగని పోరాటాలు
మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు. కాలేజీ ఏర్పాటుకు దశాబ్ధ కాలంగా విద్యార్థులు పోరాటాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. సమీపంలో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి తన సొంత డబ్బులతో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఆరేళ్ల క్రితం ఇచ్చిన హామీ కూడా అలాగే మిగిలిపోయింది.
మారని శామీర్‌పేట బస్టాండ్ దుస్థితి
ఒకప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయంలో నిర్మించిన శామీర్‌పేట బస్టాండ్‌ను నేడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. 8 ఎకరాల విశాలమైన స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజీవ్‌రహదారికి ఆనుకుని శామీర్‌పేట నడిబొడ్డున ఉన్న బస్టాండ్ నేడు కళావిహీనంగా మారింది. ఇందుకు ప్రఽధాన కారణం బస్టాండ్ ఆవరణలోకి బస్సులు రాకపోవడమే. ఒకప్పుడు క్రమం తప్పకుండా బస్సులు వచ్చేవి. దీంతో బస్టాండ్ ప్రయాణికులతో కళకళలాడేది.
ప్రారంభానికి నోచుకోని రైతుబజార్
2011లో రూ.98 లక్షలలు వెచ్చించి నిర్మించిన మేడ్చల్ రైతుబజార్ 13 సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిర్మాణం పూర్తయినా స్థల వివాదం కారణంగా అలాగే మిగిలిపోయింది. దీంతో రోడ్లపైనే కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థల వివాదానికి పరిష్కారం చూపకపోవడంతో ఏళ్ల తరబడి సమస్య అలాగే ఉంది.
శాపంగా డంపింగ్ యార్డు
నియోజకవర్గ ప్రజలకు జవహర్ నగర్ డంపింగ్ యార్డు శాపంగా మారింది. కీసర మండలానికి ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వేసే చెత్తాచెదారంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. పంటలు సైతం నాశనం అవుతున్నాయని ప్రజలు విన్నవించినా పాలకులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
పర్యాటక కేంద్రంగా మారని కీసరగుట్ట
కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా మారుతుందా లేదా అని ప్రజలు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో బీఆర్‌ఎస్ హయంలో రూ. 75 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేశారు. అనాటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ప్రఖ్యాత శిల్పి ఆనంద్‌సాయిలు ఇద్దరు ఆలయాన్ని సందర్శించినప్పటికీ ఇప్పటికీ పనులు ముందడుగు వేయలేదు. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కీసరగుట్టను సందర్శించి పర్యాటక కేంద్రం ఏర్పాటుపై డీపీఆర్ సిద్ధం చేశామని అదేశించినప్పటికీ అది కార్యరూపం దాల్చేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
శిథిలావస్థలో ఘట్‌కేసర్ గురుకులం
ఘట్‌కేసర్‌లోని గురుకుల్ పాఠశాల శిథిలమై అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు వందల మంది విద్యార్థులతో విరాజిల్లిన విద్యాలయం నేడు కనీస కాపలదారు సైతం లేక వెలవెలబోయి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ముందుకురావడం లేదు. విద్యాలయం మూతపడే ప్రమాదం ఏర్పడినప్పటికీ పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలోనే ఏ యూనివర్సిటికీ లేనన్ని ఆస్తులు ఘట్‌కేసర్ గురుకుల్ పేరిట ఉండగం గమనార్హం. అలాగే ఘట్‌కేసర్‌లో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోవడంతో పజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.