Share News

పని ప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:55 PM

జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారు పనిచేస్తున్న చోట సౌకర్యాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత సూచించారు.

పని ప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
పర్వతాపూర్‌లో కూలీలతో మాట్లాడుతున్న డీఆర్డీవో శ్రీలత

కొందుర్గు, ఏప్రిల్‌ 16 : జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారు పనిచేస్తున్న చోట సౌకర్యాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశపు మందిరంలో అధికారులతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ కాలం దృష్ట్యా కూలీలతో ఉదయం, సాయంత్రం పూటల్లోనే పనిచేయించాలని, పని చేసే స్థలంలో కూలీలకు నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడే తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఒక్కో కూలీకి రెండు లీటర్ల నీటిని అందించాలని, వ్యవసాయ బోర్ల నీటిని కూలీలకు అందించొద్దని, మిషన్‌ భగీరథ నీటినే ఇవ్వాలని సూచించారు. పనిచేసే కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, కూలీలు పనిచేస్తున్న చోట్లకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వెళ్లాలని సూచించారు. కూలీలకు గతంలో రోజువారీ కనీస వేతనం 272 రూపాయలు వస్తుండేదని, ప్రస్తుతం 300 రూపాలయ వరకు పెరిగిందని అన్నారు. పనిచేస్తాం అన్న వారందరికీ పనులు కల్పించాలన్నారు. నర్సరీల్లో లోకల్‌గా దొరికే మొక్కలను కూడా పెంచే విధంగా చూడాలని, నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిని పట్టాలని అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే, సీవిజల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కూలీలకు ఆరు వారాలుగా బిల్లులు రాకుంటే ఎలా? అని విలేకరులు ప్రశ్పించగా.. పనిచేసిన వారం రోజుల్లోనే కూలీల బిల్లులను ఆప్‌లోడ్‌ చేస్తామని, పెండింగ్‌ బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు డీఆర్డీవో పర్వతాపూర్‌, గంగన్నగూడెం గ్రామాల్లో కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలను సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. రోజు కూలి 300 వచ్చే విధంగా పనులు చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఆంజనేయులు, మండల ప్రత్యేకాధికారి శివలాల్‌, ఎంఈవో కిష్టారెడ్డి, ఎంపీవో లాలయ్య, ఏపీవో నర్సింగ్‌రావు, జంగయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:55 PM