Share News

ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:51 PM

ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌ అన్నారు.

ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
మహేశ్వరం : జెన్నాయిగూడలో రైతులతో మాట్లాడుతున్న కేఎల్లార్‌

మహేశ్వరం/కందుకూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌ అన్నారు. గురువారం జెన్నాయిగూడలో భూ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు తగిన న్యాయం జరిగేలా తాను బాధ్యత తీసుకుంటానన్నారు. ఊరికి గ్రామకంఠం ఏర్పాటుచేసి ఆ స్థలాలకు క్రయవిక్రయాలు జరిగేలా అధికారులతో మాట్లాడి చట్టబద్దత కల్పిస్తామన్నారు. అలాగే తుక్కుగూడలోని క్యాంపు కార్యాలయంలో లేమూరు రైతులతో కేఎల్లార్‌ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. కందుకూరు మండలం బేగరికంచ, మీర్కాన్‌పేట పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్‌సిటీ వరకు వేసే రోడ్డు వల్ల భూములు కోల్పోయే ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామన్నారు. పీసీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కృష్ణానాయక్‌, నాయకులున్నారు. కాగా, తమ భూములు ఫోర్త్‌సిటీ రోడ్డుకు ఇచ్చేది లేదని కేఎల్లార్‌తో లేమూరు, అగర్‌మియాగూడ రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సుధాకర్‌రెడ్డి అనే రైతు తెలిపారు. ఒకవేళ దౌర్జన్యం చేసి భూములను తీసుకుంటే మా కుటుంబ సభ్యులను చంపి శవాలపై రోడ్డు వేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఫోర్త్‌సిటీ పనులు పారదర్శకంగా చేయాలని తెలంగాణ హ్యూమన్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు కోరారు. భూములు ఇస్తున్న రైతులకు పరిహారం మూడింతలు చెల్లించాలని కోరారు.

Updated Date - Nov 28 , 2024 | 11:51 PM