Share News

ఓటుహక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 12 , 2024 | 12:15 AM

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

ఓటుహక్కును వినియోగించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, మే 11: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో శనివారం సాయంత్రం 6గంటల నుంచి ఎన్నికల ప్రచారాలు ఉండవని తెలిపారు. పోలింగ్‌ ముగిసే వరకూ సభలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లతో ప్రచారాలు నిర్వహించొద్దని సూచించారు. జిల్లాలో మొత్తం 9,83,191 ఓటర్లు ఉన్నారని మొత్తం జిల్లాలో 1148 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 108రూట్లను ఏర్పాటు చేసి ఆదివారం వారికి పోలింగ్‌ సామగ్రిని ఇచ్చి పోలింగ్‌ కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపారు. 602 పోలింగ్‌ స్టేషన్లలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, 253పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్‌, సమస్యాత్మక కేంద్రాల్లో వీడియో గ్రాఫర్లను ఉంచనున్నట్లు తెలిపారు. కౌటింగ్‌ సెంటర్లు చేవెళ్లలో, కొడంగల్‌కు సంబంధించి మహబూబ్‌నగర్‌లో ఉంటుందన్నారు. జిల్లాలో ఉద్యోగులు 7248 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకున్నారు. 84 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. వాటిని రేపు చేవెళ్లకు పంపించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సీనియర్‌ సిటిజన్స్‌ కోసం హోమ్‌ ఓటర్‌గా 192మంది, ఎస్‌ఎ్‌సఎల్‌ ఓటింగ్‌ 112గా నమోదయ్యాయని మొత్తంగా 304ఓట్లు పోలయ్యాయని తెలిపారు. జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా 66 ఫిర్యాదులు అందాయన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

ఈవీఎంల పంపిణీ సక్రమంగా జరగాలి

ఎన్నికలు జరిగే ముందు ఈవీఎంల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి మేరి ఏనాట్స్‌ లో డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. 12వ తేదీన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో సెక్టార్‌ వారీగా పోలింగ్‌ స్టేషన్లకు ఈవీఎంలను జాబితా ప్రకారం సీరియల్‌ నెంబర్‌గా అందజేయాలన్నారు. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మైకులు, కూలర్లు, తాగునీరు, భోజన సదుపాయాల్లో సమస్యలు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, వికారాబాద్‌ తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్‌ రమణ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

పరిగి: పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరిగి అసెంబ్లీ అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.వాసుచంద్ర తెలిపారు. పరిగిలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిగి అసెంబ్లీ పరిధిలో 305పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం ఓటర్లు 2,66,566 ఉన్నారని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఈసారి కొత్తగా ప్రతీ పీఎ్‌సకు వెల్‌కం కిట్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. 165 కేంద్రాల్లో మెయినల్‌ లోకేషన్‌లో కెమెరాలు, 7మంది సెక్టోరియల్‌ అధికారులు, 60కేంద్రాల్లో అవుట్‌సైడ్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 1830 మంది పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే పరిగిలోని మినీస్టేడియం కేంద్రం నుంచి సిబ్బంది, ఈవీఎంలను గ్రామాల వారీగా కేటాయిస్తామని తెలిపారు. చెక్‌ పోస్టుల వద్ద తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.66,93,350లు సీజ్‌చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఆనంద్‌రావు, పురుషోత్తం ఉన్నారు. కాగా, పరిగిలోని మినీస్టేడియం మైదానంలో ఎన్నికల సామాగ్రి తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి

పూడూరు: ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన పరిశీలకులు రాజేంద్రకుమార్‌ కలోడియ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా శనివారం పూడూరు మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లి చెక్‌ పోస్టును ఆయన సందర్శించారు. ఆయన వెంట ఏఎ్‌సఐ సత్తయ్య, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:15 AM