Share News

ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:59 PM

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ లోకసభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు.

 ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం
చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి సబితారెడ్డి

నేడు చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి

ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్‌

రెండు లక్షల జనం తరలింపే లక్ష్యం.. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌/చేవెళ్ల, ఏప్రిల్‌ 12) : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ లోకసభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు. పార్లమెంట్‌ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కారుస్పీడు పెరుతోంది. ఇప్పటికే తెలంగాణభవన్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమై లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. శనివారం చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ అధినేత కేసీఆర్‌ హాజరు కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న బహిరంగసభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. చేవెళ్లతో పాటు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, భువనగిరి, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానాలతో రంగారెడ్డిజిల్లాకు అనుబంధం ఉండటంతో చేవెళ్ల వేదికగా ప్రతిపక్ష పార్టీల పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్‌ ప్రసంగం సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు చేవెళ్ల ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టి గులాబీ జెండా ఎగురవేసి ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పాలని అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తొలిసభకు రెండు లక్షల మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే సబితారెడ్డి

బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభను బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుప నిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనున్న బహిరంగసభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లతో కలిసి సబితారెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చేవెళ్లలో జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్ల పాలన, కాంగ్రెస్‌ పార్టీ మూడు నెలల పాలన బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేవెళ్ల లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే యాదయ్య, శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లు మాట్లాడారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ.. బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రాష్ట్రనాయకులు కార్తీక్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు అనంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.యాదగిరి, గిరిధర్‌రెడ్డి, వెంకటేశ్‌, తోట చంద్రశేఖర్‌, నరేందర్‌గౌడ్‌, నర్సింహులు, వెంకటేశ్‌, మహేందర్‌, మాజీ సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:59 PM