Share News

నయా జోష్‌!

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:57 PM

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్‌ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

నయా జోష్‌!
న్యూ ఇయర్‌ వేడుకలకు ముస్తాబైన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నోవాటెల్‌

కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం

హోటళ్లు, రిసార్ట్‌లు, క్లబ్‌లు ముస్తాబు

సరికొత్త ఆఫర్లతో స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్‌ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. నగర శివార్లలోని స్టార్‌ హోటళ్లు, రిసార్ట్‌లు, క్లబ్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు వేడుకలకు ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబయ్యాయి. పలుచోట్ల సినీతారలతో సందడి చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కళాకారులను తీసుకువచ్చి డీజేలు, లైవ్‌ మ్యూజి క్‌లతో వేడుకలు నిర్వహించనున్నారు. వినోదంతో పాటు తిన్నోళ్లకు తిన్నంత... తాగినోళ్లకు తాగినంత అనే రీతిలో నిర్వాహకులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నోవాటెల్‌, శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌, పర్వేద పరిధిలోని ఫాంఎక్సోటికా రిసార్ట్స్‌, ్ఠగ్రీన్‌వాలీ, మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్‌, పోలోరైడింగ్‌ క్లబ్‌, చిలుకూరులోని మృగవని ఏకో రిసార్ట్స్‌లో, ముర్తూజగూడలోని ఈవెన్‌ రిసార్ట్స్‌ న్యూ ఇయర్‌ జోష్‌కు ముస్తాబయ్యాయి. వ్యక్తిగత ఫామ్‌హౌ్‌సలలో వేడుకలను నిర్వహించుకునేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో కూడా న్యూఇయర్‌ సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద వేడుకలు చేసుకునేందుకు యువకులు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సర వేడుకలను పుసర్కరించుకుని బేకరీలు, స్వీట్‌ హౌస్‌లు ఐటమ్స్‌ సిద్ధం చేస్తున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు.

రూ.లక్షకుపైగా టిక్కెట్‌ ధరలు

నూతనసంవత్సర వేడుకలకు సంపన్న వర్గాలు భారీ ఖర్చులకు వెనుకాడడం లేదు. వీరిని దృష్టిలో పెట్టుకుని కొన్ని హోటళ్లు, రిసార్ట్‌ల యాజమాన్యాలు ఆర్భాటంగా న్యూఈయర్‌ వేడుకలు నిర్వహిస్తున్నాయి. పలు నక్షత్రహోటళ్లు, రిసార్ట్‌ల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక్కడ టిక్కెట్‌ ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మాదాపూర్‌ రెడ్‌ రిహినోలో డీజే అభిలాష్‌ కార్యక్రమానికి రూ.5499 నుంచి గరిష్టంగా టిక్కెట్‌ ధర రూ. 1,50,000లుగా నిర్ణయించారు. అయిదు గచ్చిబౌలిలో హార్ట్‌ కప్‌ కాఫీ ‘ఎరా2’ పేరుతో నిర్వహిస్తున్న మ్యూజిక్‌ పార్టీకి టిక్కెట్‌ ధర రూ.2499 నుంచి రూ1,00,000 నిర్ణయించారు.. ప్రఖ్యాత సింగర్స్‌ జెమ్మర్‌, డీజే కార్నివోర్‌ పాల్గొంటున్నారు. దుర్గం చెరువ వద్ద బీచ్‌ థీమ్‌ పార్టీకి గరిష్టంగా రూ. 45వేల టిక్కెట్‌ ధర ఉంది. శామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్‌ న్యూఈయర్‌ వేడుకలకు ముస్తాబైంది. ఇక్కడ రూమ్‌ల ధరలు ధర గరిష్టంగా రూ. 34999గా నిర్ణయించారు. అలాగే ప్రగతి రిసార్ట్‌లో కూడా న్యూఈయర్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ఇక్కడ కూడా రూమ్‌లకు గరిష్టంగా రూ. 25వేల వరకు ప్యాకేజీలు పెట్టారు.

Updated Date - Dec 30 , 2024 | 11:57 PM