జిల్లా గొప్పతనాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:09 AM
వికారాబాద్ జిల్లాలో భాషా సాహిత్య రంగాలను ప్రోత్సహించేందుకు కృషిచేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఇటీవల ప్రచురించిన వికారాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య సోమవారం కలెక్టర్‌కు అందజేసి సత్కరించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 5 : వికారాబాద్ జిల్లాలో భాషా సాహిత్య రంగాలను ప్రోత్సహించేందుకు కృషిచేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఇటీవల ప్రచురించిన వికారాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య సోమవారం కలెక్టర్‌కు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు క్రియాశీలంగా సాగుతున్నామని, ఇకపై భాషా సాహిత్యాలకూ తగిన ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. మొన్నటి వరకు పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఉన్న వికారాబాద్ జిల్లా నేడు అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటోందన్నారు. ఈ అంశాలపై తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాన్ని అందరికీ అందించే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతొక్కరూ తమ జిల్లా గొప్పదనాన్ని తెలుసుకోవాలన్నారు. చెన్నయ్య మాట్లాడుతూ.. నిజాం కాలంలో 80ఏళ్ల కిందట వెలసిన తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు భాషా పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, భాషా-సాహిత్యాలు, కళలు మొదలైన అంశాలపై సమగ్ర గ్రంథాలను వెలువరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 16 జిల్లాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ గ్రంథాన్ని రూపొందించడంలో పరిషత్తుకు తోడ్పడిన అవధాని అంజయ్య ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డిపై పద్యాన్ని ఆలపించారు.