పదవి లేకున్నా ప్రజల్లోనే ఉంటా..
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:44 PM
పదవి లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటానని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రతీ ఒక్కరికి, తన కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి
చేవెళ్ల, జూన్ 7: పదవి లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటానని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రతీ ఒక్కరికి, తన కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పదవులు ఉన్నా, లేకున్నా తన ప్రజా సేవ ఆగదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డమీద కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామన్నారు. ఎన్నికల ఫలితం తమ అంచనాలకు భిన్నంగా వచ్చిందన్నారు. కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. రెండు, మూడు నెలలపాటు సాగిన ఎన్నికల మహత్తర పోరాటంలో చేవెళ్ల ప్రజల తీర్పును తాను నిండు మనస్సుతో గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటిలాగే అభివృద్ధి, అందుబాటు అనే నినాదంతోనే చేవెళ్ల ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో భాగం అవుతానని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎవరూ చింతించాల్సిన పని లేదన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఫీనిక్స్ పక్షి మాదిరి కింద నుంచి పైకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం తాను వారం రోజులపాటు అందుబాటులో ఉండటం లేదని, వారం తర్వాత ప్రజాసేవలో నిమగ్నమవుతానని రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు.