Share News

ఈఎస్ఐ ఆస్పత్రికి మళ్లీ తాళం

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:50 PM

మేడ్చల్‌ పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి భవనం యజమాని శుక్రవారం మరోసారి తాళం వేశాడు.

ఈఎస్ఐ ఆస్పత్రికి మళ్లీ తాళం
ఆస్పత్రి ఎదుట నిరీక్షస్తున్న రోగులు, సిబ్బంది

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 5: మేడ్చల్‌ పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి భవనం యజమాని శుక్రవారం మరోసారి తాళం వేశాడు. అద్దెచెల్లింపు విషయంలో గత నెలలో దాదాపు 20రోజుల పాటు ఆసుపత్రి భవనానికి తాళం వేసిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకు రావటంతో స్థానిక నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని భవనం యజమానితో మాట్లాడి ఆసుపత్రి సేవలు ప్రారంభించారు. కాగా ఇంటి యజమాని తనకు ఇచ్చిన మాట ప్రకారం అద్దె చెల్లింపు విషయంలో ఈఎ్‌సఐ ఆసుపత్రి వారు అద్దె చెల్లించే విషయంలో మాట తప్పారంటూ శుక్రవారం ఉదయం తిరిగి ఆసుపత్రి ద్వారాలకు తాళం వేసి వెళ్లాడు. ఫలితంగా విధులకు వచ్చిన సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన రోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రి ముందు పడిగాపులు కాయాల్సివచ్చింది. తాళం తీయాలని సిబ్బంది భవన యజమానిని కోరినా ససేమిరా అనడంతో విషయాన్ని ఉన్నత అధికారులకు తెలయజేశారు. సిబ్బంది ఆసుపత్రి ముందు అరుగులపై సమయం గడిపి ఇళ్లకు వెళ్లిపోయారు. అద్దె భవనంలో విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రి కారణంగా తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు రోగులు ఆరోపించారు. ప్రతీరోజు బీపీ, షుగర్‌, ఇతర మందుల కోసం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారని ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి మూత పడితే తమ పరిస్థితి ఏంటని ప్రజలు వాపోతున్నారు. ఈఎ్‌సఐ ఆసుపత్రి ఎదుర్కొంటున్న అద్దె భవనం సమస్యను ఉన్నత అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:50 PM