Share News

దివ్యాంగులకు పెంచిన పెన్షన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:30 PM

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

దివ్యాంగులకు పెంచిన పెన్షన్‌ ఇవ్వాలి
మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న దివ్యాంగులు

-కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి

-ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌

మేడ్చల్‌ ప్రతినిధి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పెన్షన్‌ రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెన్షన్‌ సొమ్మును పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. పెన్షన్‌లు పెంచేందుకు డబ్బులు లేవని చెప్తూనే మరోవైపు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌, మల్లేష్‌, లక్ష్మీపతి, బాలయ్య, శివ, రమేష్‌, చంద్రయ్య, బ్రహ్మయ్య, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట..

రంగారెడ్డి అర్బన్‌: దివ్యాంగులకు కొత్త పింఛన్‌ మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వెంకట్‌, గౌరవ అధ్యక్షుడు వరమ్మ, ప్రధాన కార్యదర్శి అడివయ్య, కోషాధికారి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు చేగూరి శేఖర్‌గౌడ్‌, భుజంగరెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:30 PM