ఆలూరు నుంచే ‘ఉపాధి హామీ’ ప్రారంభం
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:53 PM
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఆలూర్ నుంచే ఉపాధి హామీ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

జిల్లాతో మాజీ ప్రధానికి అనుబంధం
చేవెళ్ల, డిసెంబరు 27 (ఆంధ్యజ్యోతి): భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఆలూర్ నుంచే ఉపాధి హామీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. గురువారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో మన్మోహన్ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకుని ఆలూర్ గ్రామస్తులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దివంగత జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డిలతో కలిసి దేశ ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ఆలూర్ గ్రామానికి వచ్చారు. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ గ్రామంలోనే అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బహిరంగ సభ నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అప్పుడు వేసిన మన్మోహన్‌సింగ్ వేసిన శిలాఫలకం ఇప్పటికీ ఉంది.
మన్మోహసింగ్‌ను సన్మానించిన అప్పటి ఆలూరు సర్పంచ్
ఆలూరు గ్రామానికి వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అప్పటి ఆలూరు గ్రామ సర్పంచ్ సక్కుబాయి, ఎంపీటీసీ తమ్మగోని లక్ష్మి వేదికపై శాలువాలతో సన్మానించారు. అనంతరం మెమోంటోను అందజేశారు. మన్మోహన్‌సింగ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న వీరు అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
దేశానికి తీరని లోటు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరనిలోటు. దేశంలోని పేదలందరికీ ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని ఆలూర్ నుంచి ప్రారంభించిన జ్ఞాపకాలు ఇప్పటికే కళ్లల్లో మెదులుతున్నాయి. వేదికపై సర్పంచ్‌గా ఆయన పక్కన నేను కూర్చోవడం చాలా గౌరవంగా ఉంది. దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది.
- సక్కుబాయి, ఆలూరు గ్రామ మాజీ సర్పంచ్
ఆలూరుకు రావడం మరిచిపోలేనిది
దేశ ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ఆలూర్ గ్రామానికి రావడం చాలా గొప్పవిషయం. ఇక్కడి నుంచి ఉపాధి హామీ పథకం ప్రారంభించడం మరిచిపోలేనిది. అప్పుడు ఎంపీటీసీగా ఉండటంతో నాకు మన్మోహన్‌సింగ్‌ను కలిసే భాగ్యం కలిగింది. ఆయన మరణం చాలా బాధాకరం.
- తమ్మగోని లక్ష్మి, మాజీ ఎంపీటీసీ ఆలూరు