Share News

బెల్టుషాపులకు ఎన్నికల కోడ్‌ వర్తించదా?

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:11 AM

మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జరపరాదని సంబంధిత అధికారులు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

బెల్టుషాపులకు ఎన్నికల కోడ్‌ వర్తించదా?

కులకచర్ల, ఏప్రిల్‌ 13: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జరపరాదని సంబంధిత అధికారులు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో బెల్టుషాపుల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం కులకచర్లలో వైన్‌ దుకాణాలు రాత్రి 10గంటల వరకు మూతపడుతున్నా బెల్టుషాపులు మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. రోడ్డు పక్కన దుకాణాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగించడంతో ఆ దారిలో వెళ్లేందుకు వాహనదారులు, మహిళలు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజుల కిందట ప్రత్యేక బృందాలు కులకచర్లలో బెల్టుషాపులపై దాడిచేశారు. మద్యం లభించినా ఏ చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం గమనార్హం. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో బెల్టు షాపులపై సంబంధిత అధికారులు దాడులు నిర్వహిస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు బెల్టు షాపుల నిర్వాహకులు దర్జాగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు బహిరంగంగా మద్యం విక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బెల్టుషాపులపై నామమాత్రపు దాడులు చేసి నిర్వాహకులను వదిలిపెట్టడం సరైన పద్ధతికాదని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:11 AM