Share News

విద్య, వైద్యం అస్తవ్యస్తం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:58 PM

జిల్లాలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారిందని, మైరుగైన సేవలు అందడం లేదని జడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు.

విద్య, వైద్యం అస్తవ్యస్తం
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

మెరుగైన సేవలందడం లేదని సభ్యుల ధ్వజం

డాక్టర్లు అందుబాటులో ఉంటలేరని ఆగ్రహం

టీచర్ల కొరతతో విద్యార్థులకు అందని ద్రాక్షలా విద్య

విద్య, వైద్య శాఖల్లో డిప్యూటేషన్ల రద్దుకు తీర్మానం

జడ్పీ సర్వసభ్య సమావేశంలో వాడీవేడి చర్చ

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 11 : జిల్లాలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారిందని, మైరుగైన సేవలు అందడం లేదని జడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, సభ్యులు హాజరయ్యారు. కోరం లేని కారణంగా సమావేశాన్ని గంట ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా డాక్టర్లు ఉండటం లేదని, డ్యూటీకి వచ్చినా సమయపాలన పాటించడం లేదన్నారు. డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ చేసినా ఒక్క వైద్యుడూ ఉండటం లేదని ఎంపీపీ ఆరోపించారు. పోస్టుమార్టం గదిని ఇళ్ల మధ్య నుంచి తొలగించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రుల ఆపరేషన్‌ థియేటర్లలో సౌకర్యాలు లేక మూతపడ్డాయని చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ల దృష్టికి తెచ్చారు. షాపూర్‌ పీహెచ్‌సీలో మూడు నెలల నుంచి వైద్యుల్లేరని డీఎంహెచ్‌వో దృష్టికి తెచ్చారు. శంషాబాద్‌లో డాక్టర్‌ ఇలా వచ్చి అలా వెళ్తున్నారని జడ్పీటీసీ సభ్యురాలు ఆరోపించారు. డీఎంహెచ్‌వో స్పందిస్తూ డాక్టర్‌ జీతాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కేశంపేట పీహెచ్‌సీలో ఒక్క డాక్టరైనా అందుబాటులో ఉంటలేరని జడ్పీటీసీ విశాల తెలిపారు. ఆస్పత్రిలో పాముకాటు మందు లేదని తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేష్‌ అన్నారు. సమస్యలు విన్నవిద్దామంటే రెండు నెలల నుంచి డీఎంహెచ్‌వో ఫోన్‌ కలవడం లేదని షాబాద్‌ ఎంపీపీ చెప్పారు. షాబాద్‌ ఆసుపత్రికి డాక్టర్‌ను ఇవ్వాలని ఎంపీపీ కోరారు. యాచారం పీహెచ్‌సీలో 24గంటలు వైద్యులు ఉండటం లేదన్నారు. పల్లె దవాఖానాలో డాక్టర్లు లేరని మంచాల జడ్పీటీసీ నిత్యనిరంజన్‌రెడ్డి తెలిపారు. మొయినాబాద్‌ మండలం చిల్కూరులో ఆస్పత్రి కట్టి రెండేళ్లవుతున్నా ప్రారంభించలేదని ఎంపీపీ అన్నారు. విద్య, వైద్య శాఖల్లో డిప్యుటేషన్లను రద్దుచేయాలని, పోస్టింగ్‌ ఉన్నచోటే విధులు నిర్వర్తించాలని, అధికారులే ఉద్యోగులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. డాక్టర్ల డిప్యూటేషన్ల రద్దుకు తీర్మానం చేయాలని సభ్యులు కోరగా కలెక్టర్‌ శశాంక స్పందిస్తూ డిప్యుటేషన్లు శాఖాపరమైన నిర్ణయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో రంగారావు, కోఆప్షన్‌ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

24గంటల్లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుంటే ధర్నా చేస్తాం

కడ్తాల మండలంలో ఆరేళ్ల కింద కట్టిన కస్తూర్బా పాఠశాలకు కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వక ప్రారంభానికి నోచుకోలేదని, రూ.6.14లక్షల డీడీ కట్టించుకున్నా అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంలేదని జడ్పీటీసీ దశరథ్‌ అన్నారు. అద్దె భవనంలో కేజీబీవీ కొనసాగుతోందన్నారు. 250 మంది బాలికలు రెండే బాత్‌ రూమ్‌లతో ఇబ్బంది పడుతున్నా అధికారులకు పట్టడం లేదన్నారు. 24గంటల్లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుంటే వెయ్యి మందితో సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తానని జడ్పీ సమావేశంలో బైటాయించారు. సమస్య పరిష్కరించాలని చైర్‌పర్సన్‌ అధికారులను ఆదేశించారు. మహేశ్వరం మండలంలో స్కావెంజర్ల సమస్య తీర్చాలని సభ్యులు కోరారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలన్నారు.

ఇంకా చెట్ల కింద చదువులా?

చేవెళ్ల మండలం దేవరాంపల్లి పాఠశాల శిథిలావస్థకు చేరగా రెండేళ్లుగా పంచాయతీ భవనంలోనే కొనసాగుతోందని, పంచాయతీలో మీటింగ్‌ ఉంటే పిల్లలను చెట్లకింద కూర్చోబెడుతున్నారని జడ్పీటీసీ విజయలక్ష్మి తెలిపారు. ఇంకా చెట్ల కింద చదువులు ఏమిటని కలెక్టర్‌ శశాంక ప్రశ్నించారు. రెంటెడ్‌ బిల్డింగ్‌ చూడాలని డీఈవోను అదేశించారు. ఇబ్రహీంపట్నంలోని చర్లగూడ పాఠశాలను కూల్చివేశారని, కొత్త బడి కట్టాలని సభ్యుడు కోరారు. విద్యార్థులకు కుడుతున్న యూనిఫాంకు ధర జతకు రు.వంద చొప్పున ఇవ్వాలన్నారు. 4 మండలాలకు ఒక్కరే ఎంఈవో ఉన్నారని ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ తెలిపారు. యాచారం మండలంలో శ్రీ చైతన్య స్కూల్‌కు అనుమతి లేకున్నా 450 మంది విద్యార్థులను చేర్చుకున్నారని సభ్యురాలు తెలిపారు.

తరుగు తీస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి

బస్తాకు 2-3కిలోల ధాన్యం తరుగు తీస్తున్న రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. రైతు వేదికలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వీటితో ఉపయోగం లేకుండా పోయిందని, రైతు సమావేశాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ అక్కడే నిర్వహించాలని కోరారు. ఉద్యాన శాఖ అధికారుల అడ్రెస్సే లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చెప్పారు. గాలివానలకు విద్యుత్‌ పోతోందని, ఏఈలు, లైన్‌మెన్‌ స్పందించడం లేదని, వేలాడుతున్న వైర్లను సరిచేయాలని సభ్యులు కోరారు. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో నిధులు సక్రమంగా విడుదల కాక అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోయానని చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అన్నారు. ఈ సమావేశం చివరిదన్నారు. చాలా సమావేశాల్లో ప్రజాసమస్యలపై తీర్మానాలు చేశామన్నారు. అధికారులతో చర్చించి కొన్ని పరిష్కరించామన్నారు. ఐదేళ్లు సహకరించిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒక్క ప్రొసీడింగ్‌ ఇచ్చిన పాపాన పోలే!

ఆరు నెలల నుంచి తాము ఒక్క ప్రొసీడింగైనా ఇచ్చిన పాపాన పోలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులైతే తమ పదవీకాలం ముగుస్తుందని, అంతలోగా వర్క్‌ ప్రొసీడింగ్‌ ఇవ్వాలని కోరారు. 9 నెలల నుంచి ప్రతిపాదనలు పంపినా ప్రొసీడింగ్‌లు ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచాయని, రెండు రోజుల్లో ప్రొసీడింగ్‌లు ఇస్తామని చైర్‌పర్సన్‌ తెలిపారు.

నీటి సరఫరాలో కంట్రోలింగ్‌ సరిగ్గా లేదు

జిల్లాలో నీటి కొరత లేదని, కానీ గ్రామాల్లో పైప్‌లైన్లకు ఉన్న వాటర్‌ కంట్రోలింగ్‌ వాల్వ్‌లు సరిగ్గా పనిచేయడం లేదని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డుమ్మా

జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాలేదు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాత్రం మధ్యాహ్నం తర్వాత మీటింగ్‌కు వచ్చారు.

Updated Date - Jun 11 , 2024 | 11:58 PM