Share News

శ్రీరంగాపూర్‌లో తాగునీటి సమస్య

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

గ్రామంలోని సింగిల్‌ ఫేజ్‌ బోర్లలో నీటిమట్టం తగ్గడం.. మిషన్‌ భగీరథ నీరు రెండు, మూడు రోజులకోసారి వస్తుండడంతో శ్రీరంగాపూర్‌లో నీట సమస్య నెలకొంది.

శ్రీరంగాపూర్‌లో తాగునీటి సమస్య
శ్రీరంగాపూర్‌లోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌

బోర్లలో పడిపోయిన నీటి మట్టం

సరిగా సరఫరా కాని భగీరథ నీరు

కొందుర్గు, ఏప్రిల్‌ 18 : గ్రామంలోని సింగిల్‌ ఫేజ్‌ బోర్లలో నీటిమట్టం తగ్గడం.. మిషన్‌ భగీరథ నీరు రెండు, మూడు రోజులకోసారి వస్తుండడంతో శ్రీరంగాపూర్‌లో నీట సమస్య నెలకొంది. మండల పరిధి శ్రీరంగాపూర్‌లో 1,196 జనాభా ఉన్నారు. గ్రామంలో 60వేల లీటర్ల నీళ్ల ట్యాంకు, మరో సంపును ఏర్పాటు చేశారు. గ్రామంలో 8 సింగిల్‌ ఫేస్‌ బోరు మోటర్లు ఉన్నా బోర్లలో నీటి మట్టాలు తగ్గి నీరు పోయడం లేదు. మిషన్‌ భగీరథ ట్యాంక్‌ను ఎత్తు భాగంలో నిర్మించడంతో ఆ ట్యాంకులోకి నీరు ఎక్కక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్యాంకు వద్ద సంపు నిర్మించి దానికి బోరు కనెక్షన్‌ ఇచ్చారు. మొదట సంప్‌ను నింపి దాని నుంచి నీటిని ట్యాంకులోకి ఎక్కించి పైప్‌లైన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ట్యాంక్‌ సమీప ఇళ్లకు నీరు ఎక్కువగా వస్తుంది. ఎత్తు ప్రాంతంలో ఉండే వారికి నీరు రావడం లేదు. కొందరు నల్లా కనెక్షన్ల రెగ్యులేటర్‌ చెర్రాలు తీసేయడంతో వచ్చిన వారికే ఫుల్‌ ప్రెషర్‌తో నీరొచ్చి ఎత్తు ప్రాంతానికి నీరు రావడం లేదు. గ్రామంలోని 8 డైరెక్టు బోర్లల్లో నీరు తగ్గింది. 50 ఇండ్ల వారికి నీరు కరువైంది. నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న బోరు, పాఠశాల వద్ద, కిష్టయ్య ఇంటి వద్ద ఉన్న బోర్లలో కొద్దిపాటి నీరొస్తుండడంతో సగం గ్రామానికి నీరు అందుతోందని, మరో సగం ఇళ్లకు నీరందడం లేదని గ్రామస్తులు తెలిపారు. భగీరథ ట్యాంకుతో దగ్గరి వారికి 15 బిందెల నీరొస్తే, ఎత్తులో ఉన్న వారికి రెండు బిందెల కూడా రావడంలేదని తెలిపారు. మే నెలలో సమస్య మరింత జఠిలం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొత్తగా బోర్లు వేసి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి నల్లాలకు చెర్రాలు తీసిన వాటికి తిరిగి చెర్రాలను బిగిస్తే మరిన్ని ఇళ్లకు నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.

పది రోజులుగా నీరు రావడం లేదు : గుడికాడి యాదమ్మ, ఎస్సీ కాలనీ, శ్రీరంగాపూర్‌

మా కాలనీలో సింగిల్‌ ఫేజ్‌ బోరు మోటారులో నీటి మట్టం తగ్గిపోయింది. పది రోజులుగా తాగునీరు అందడం లేదు. ట్యాంకు వద్ద ఉన్న బోరు నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. మాకు నీళ్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ట్యాంకు నుంచి వచ్చే నీటి కొందరికే సరిపోతోంది. కొందరు నల్లాల్లో చెర్రలు తీసేయడంతో నీరంతా వారికే పోతుంది. ఎత్తులో ఉన్న వారికి నీరు రావడం లేదు.

కొత్త బోర్లు వేసేందుకు అనుమతివ్వాలి : భీమిడి రమే్‌షరెడ్డి, శ్రీరంగాపూర్‌

గ్రామంలో సింగిల్‌ ఫేజ్‌ బోరు మోటర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో పనిచేయడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉన్నందున అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకని గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు కొత్త బోర్లు వేయాలి. ఎండలు ముదురుతున్న కొద్దీ నీటి సమస్య తీవ్రం అవుతోంది. అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి.

సమస్యను పరిష్కరిస్తాం : ఆంజనేయులు, ఎంపీడీవో, కొందుర్గు

శ్రీరంగాపూర్‌లో కొన్ని వార్డుల్లో నీటి సమస్య ఏర్పడింది. ట్యాంకర్లతో తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తాం. నీటి సమస్య తీర్చేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డు కాదు. నిధులు విడుదల కాగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM