Share News

వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:45 PM

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత అత్తారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆలూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై వీరబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం..

 వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

చేవెళ్ల, జనవరి 30 : వరకట్న వేధింపులు తాళలేక వివాహిత అత్తారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆలూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై వీరబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండల పరిధిలోని రాకంచెర్లకు చెందిన లలిత కుమార్తె జ్యోతి(23)ని ఏడాదిన్నర క్రితం చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్‌ గ్రామానికి చెందిన జయగల్ల రాజుకు పెద్దల సమక్షంలో వివాహం చేశారు. ఆరుతులాల బంగారం, ఐదు లక్షల నగదుతో పాటు బైక్‌ కట్నంగా ఇచ్చారు. అయితే, కొన్ని నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలని జ్యోతిపై భర్తతో పాటు అత్తింటివారు వేధింపులకు గురుచేస్తున్నారు. దాంతో జ్యోతి నాలుగు నెలలకే పుట్టింటికి తిరిగి వచ్చింది. మూడు రోజుల క్రితం భర్త, ఇద్దరు మేనమామలు పెద్దమనుసుల సమక్షంలో జ్యోతిని మంచిగా చూసుకుంటామని మాటి ఇచ్చి పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకువచ్చారు. ఈక్రమంలో ఈనెల 29న సాయంత్రం ఇంట్లో ఎవరూలేనిది గమనించి దూలానికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతిచెందిందని జ్యోతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరబ్రహ్మం తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో తాపీమేస్త్రి..!

ఇబ్రహీంపట్నం, జనవరి 30: ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి పోచారం వద్ద ఓ వెంచర్‌లో మంగళవారం సాయంత్రం తాపీమేస్త్రీ పనిచేసే ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వనస్థలిపురం ఆర్‌కేడీ నగర్‌లో నివాసముంటున్న అంకారావు(45) తాపీమేస్త్రీ. కాగా, మంగళవారం మధ్యాహ్నం ఇంటినుంచి బయలుదేరిన అతను పోచారం శివారు ఏవీసీ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ అతడి బైక్‌ను గమనించిన గ్రామస్తుడొకరు పోలీసులకు సమాచారమందించారు. మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారయ్య తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:45 PM