వసతి గృహం.. నిరుపయోగం
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:49 PM
శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ బాలుర వసతిగృహ భవనం నిరుపయోగంగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాన్ని వెనుకబడిన సంక్షేమశాఖ అధికారులు గాలికొదిలేశారు.

నిర్వహణ లేక అధ్వానంగా శంకర్‌పల్లి బీసీ బాలుర హాస్టల్
ఏపుగా పెరిగిన చెట్లు, పేరుకుపోతున్న చెత్తాచెదారం
కొవిడ్ టైంలో పిల్లలు లేరని శేరిలింగంపల్లికి తరలింపు.. ఇంటర్ విద్యార్థులకు వినియోగిస్తున్న అధికారులు
వసతి గృహాన్ని శంకర్‌పల్లిలోనే నిర్వహించాలని స్థానికుల విన్నపాలు
శంకర్‌పల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ బాలుర వసతిగృహ భవనం నిరుపయోగంగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాన్ని వెనుకబడిన సంక్షేమశాఖ అధికారులు గాలికొదిలేశారు. దాంతో భవనంలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. నాలుగేళ్ల క్రితం కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో విద్యార్థులు లేరనే సాకుతో వసతిగృహాన్ని శేరిలింగంపల్లికి తరలించారు. అయితే, శంకర్‌పల్లి పేరున ఇంటర్మీడియట్ పిల్లలకు శేరిలింగంపల్లిలో వసతి గృహాన్ని నడుపుతున్నారని సమాచారం.
భవనాన్ని వినియోగంలోకి తేవాలి
లక్షలు వెచ్చించి నిర్మించిన వసతిగృహం నేడు నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం అద్దె భవనాల్లో వసతిగృహాలను కొనసాగిస్తుండగా, ఇక్కడ మాత్రం ప్రభుత్వ భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారు. వసతిగృహం మూసివేసిన అనంతరం అందులో ఉండే గ్యాస్ సిలిండర్, వంట సామగ్రి, బియ్యం తదితర వస్తువులు సంక్షేమశాఖ అధికారులు స్వాధీనం చేసుకోకుండా వదిలేయడంతో గుర్తుతెలియని దుండగులు వాటన్నింటినీ ఎత్తుకెళ్లారు. భవనం గదుల్లోని కిటికీలను విరగ్గొట్టి అందులో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. వసతిగృహాన్ని ఇక్కడి నుంచి తరలించినప్పటికీ అందులోని వస్తువులను సంరక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అయితే, ఇప్పటికైనా శేరిలింగంపల్లికి తరలించిన వసతిగృహాన్ని తిరిగి శంకర్‌పల్లిలో నడపాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ భవనాన్ని ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భవనాన్ని ఇలాగే వదిలేస్తే పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎందుకూ పనికిరాకుండా పోతుంది.
వసతిగృహాన్ని తిరిగి శంకర్‌పల్లిలో నడపాలి
కోవడ్ సమయంలో విద్యార్థులు లేరనే సాకుతో శేరిలింగంపల్లికి వసతిగృహాన్ని తరలించారు. కోవిడ్ అయిపోయినాక అయినా వసతిగృహాన్ని శంకర్‌పల్లిలో నడపడం లేదు. బిస్సీ విద్యార్థులు వసతిగృహం లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విశాలమైన భవనం ఉండి కూడా లాభం లేకుండా పోతున్నది. శేరిలింగంపల్లి నుంచి శంకర్‌పల్లికి వసతిగృహాన్ని తరలించాలి.
- దేవ ప్రవీణ్, శంకర్‌పల్లి
-------------------------
భవనం పాడవుతున్నా పట్టించుకోవడం లేదు
బిస్సీ వసతిగృహాన్ని శేరిలింగంపల్లికి తరలించడంతో శంకర్‌పల్లి వసతిగృహ భవనాన్ని ఉపయోగించడం లేదు. భవన ప్రాంగణంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అది చిన్న పాటి అడవిని తలపిస్తున్నది. దుండగులు కిటికీలను ద్వంసం చేశారు. అధికారులు పట్టించుకోకపోతే భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా మేల్కొని భవనాన్ని ఉపయోగంలోకి తేవాలి.
- గొల్ల మల్లేశం, మహాలింగపురం