Share News

రైల్లోంచి కిందపడి దివ్యాంగుడు మృతి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:37 AM

రైల్లోంచి కిందపడి ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద-వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య జరిగింది. వికారాబాద్‌ మండలంలోని సిద్దలూర్‌ గ్రామానికి చెందిన దయ్యాల గోపాల్‌(50) గ్రామం నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు బుధవారం వచ్చాడు.

రైల్లోంచి కిందపడి దివ్యాంగుడు మృతి

నవాబుపేట, ఏప్రిల్‌ 24: రైల్లోంచి కిందపడి ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద-వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య జరిగింది. వికారాబాద్‌ మండలంలోని సిద్దలూర్‌ గ్రామానికి చెందిన దయ్యాల గోపాల్‌(50) గ్రామం నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు బుధవారం వచ్చాడు. ఈక్రమంలో రైలులో ప్రయాణిస్తుండగా కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తి దివ్యాంగుడని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. మృతదేహానికి వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

రైలుకింద పడి మరొకరు..

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 24: రైలుకింద పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నవాంద్గీ(బషీరాబాద్‌) రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సందీప్‌ప్రసాద్‌(37) బుధవారం తెల్లవారుజామున ఇంట్లోంచి దగ్గరలోని రైలు పట్టాల వైపు వెళ్లాడు. ఈ క్రమంలో గూడ్స్‌ రైలు రావడంతో అతడిని ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రైన్‌ పైలట్‌ సమాచారంతో స్థానిక స్టేషన్‌మాస్టర్‌ తాండూరులోని రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడి ఆనవాళ్లు గుర్తించి మృతుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. కుటుంబీకులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టి మృతిచెంది ఉండోచ్చని అనుమానిస్తున్నారు. మృతికి గల కారణలపై విచారణ జరిపిన పోలీసులు మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి ..

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన సంఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని కొత్తగడి గ్రామ శివారులో అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తి శవం లభించిందని, వయస్సు దాదాపు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని, బూడిద కలర్‌ చొక్కా, క్రీమ్‌ కలర్‌ ప్యాంటు కలిగి ఉన్నట్లు చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే సెల్‌ 8712670030కు ఫోన్‌ చేసి సంప్రదించాలని సూచించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:37 AM