జమిలి ఎన్నికలతో నియంత పాలన
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:44 PM
జమిలి ఎన్నికలతో నియంతలా దేశాన్ని పాలించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, ప్రాంతీయ పార్టీల మనుగడకే ముప్పు వాటిల్లే ఈ ఎలక్షన్స్‌ను వ్యతిరేకించాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలి
హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలతో నియంతలా దేశాన్ని పాలించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, ప్రాంతీయ పార్టీల మనుగడకే ముప్పు వాటిల్లే ఈ ఎలక్షన్స్‌ను వ్యతిరేకించాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలోని రాష్ట్రాల పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, పైగా అధికార వికేంద్రీకరణ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులపాటు నిర్వహించే సీపీఎం 10వ జిల్లా మహాసభలు శనివారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభమయ్యాయి. స్థానిక చౌరస్తాలో జరిగిన బహిరంగసభకు తమ్మినేని హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీ్‌షకుమార్‌ల మద్దతుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన అన్నారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త అదానీ నుంచి ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.1700కోట్లు ముడుపుల ద్వారా లబ్ధిపొందారని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఆయనపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారంటూ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అదానీని రక్షించేందుకే ప్రాధాన్యతనిస్తోందన్నారు. తెలంగాణలో గత, ఇప్పటి ప్రభుత్వాలు రూ.14 వేల కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమలులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన విమర్శలు చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పడంతోపాటు దానికోసం సేకరించిన భూములను తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఇప్పుడు దాని ఊసే లేదని మండిపడ్డారు. ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి మరో 15 వేల ఎకరాలు సేకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన అన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో అభిప్రాయ సేకరణ సందర్భంగా లగచర్లలో రైతుల అరెస్టులను తాము తప్పుబట్టామన్నారు. తమకు సీటు, ఓట్లు ముఖ్యం కాదని పేద ప్రజల పక్షాన పోరే ప్రధానమన్నారు. ఈ మహాసభల్లో రాబోవు కాలంలో చేపట్టబోయే ఉద్యమాలు, కార్యాచరణపై తగు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జాన్‌వెస్లీ, డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, నాయకులు పి.జంగారెడ్డి, పి.యాదయ్య, బి.మధుసూదన్‌రెడ్డి, బి.సామేల్, కె.జగన్, డి.జగదీష్, సీ.హెచ్.జంగయ్య, కె.శ్రీనివా్‌సరెడ్డి, కవిత, సీ.హెచ్.బుగ్గరాములు, చింతపట్ల ఎల్లేష్, రావుల జంగయ్య, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.