Share News

కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:43 PM

కీసరగుట్ట, చీర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు
స్వామి దర్శనానికి క్యూలైన్లో నిల్చున్న భక్తులు

కీసర, జనవరి 1: కీసరగుట్ట, చీర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రామలింగేశ్వర, చీర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఈమేరకు ఆలయ నిర్వాహకులు ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అభిషేకాలకు, అర్చనలకు అనుమతించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా క్యూలైన్‌లో ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయంపై ట్రాఫిక్‌ ఇబ్బంది రాకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహకులు ప్రముఖులకు ఆశీర్వచనలు అందజేశారు. జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డిల నివాసాలకు వెళ్లిన ఆలయ నిర్వాహకులు, అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రాలతో ఆశీర్వదించారు.

అధిక ధరలు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కీసరగుట్టలో భక్తుల వద్ద అధిక ధరలు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నూతన సంవత్సరం కావడంతో సోమవారం భక్తులు అధిక సంఖ్యల్లో ఆలయానికి విచ్చేశారు. ఇదే అదును చూసుకొని మరుగుదొడ్ల నిర్వహకులు భక్తుల వద్ద నుండి నిబంధనల విరుద్ధంగా అధిక ధరలు వసూళ్లు చేశారు. గమనించిన భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూత్ర విసర్జన ఉచితం, మల విసర్జనకు 5 రూ.లు, స్నానానికి 10 రూ.ల చొప్పున వసూళ్లు చేయాలి, కానీ నిర్వహకులు మూత్ర విసరజనకే 10రూ.లు, మల విసర్జనకు 20 రూ.లు వసూళ్లు చేస్తున్నారు. ఇందేటనీ భక్తులు నిర్వహకులను ప్రశ్నిస్తే మేము, అధికారులకు, పాలక మండల సభ్యులకు ముడుపులు చెల్లించాల్సి ఉంటుందని అధిక రుసుము వసూళ్లు చేయక తప్పదని మరుగుదొడ్ల నిర్వహకులు భాహాటంగా చెబుతున్నారని భక్తులు అధికారులకు తెలియజేశారు. వీటితో పాటు పార్కింగ్‌, కోబ్బరికాయలు, దర్శనం టిక్కెట్లు కూడా అధికంగా వసూళ్లు చేస్తున్నారని , అధిక ధరలు వసూళ్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులు తెలియజేశారు.

Updated Date - Jan 01 , 2024 | 11:43 PM